ధోనీ రికార్డ్ ముంగిట రహానె!

     Written by : smtv Desk | Wed, Jan 06, 2021, 07:12 PM

ధోనీ రికార్డ్ ముంగిట రహానె!

ఆస్ట్రేలియా గడ్డపై ఇటీవల ముగిసిన మెల్‌బోర్న్ టెస్టులో టీమిండియాని ముందుండి నడిపించిన కెప్టెన్ అజింక్య రహానె.. అరుదైన రికార్డ్‌కి అడుగు దూరంలో ఉన్నాడు. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలి టెస్టు ముగిసిన తర్వాత పితృత్వ సెలవులు తీసుకుని భారత్‌కి వచ్చేయగా.. రెండో టెస్టులో కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న రహానె సెంచరీతో టీమిండియా విజయంలో క్రియాశీలక పాత్ర పోషించాడు. మొత్తంగా ఇప్పటి వరకూ మూడు టెస్టుల్లో కెప్టెన్‌గా టీమిండియాని రహానె నడిపించగా.. మూడింటిలోనూ భారత్ విజయం సాధించింది. ఇక సిడ్నీ వేదికగా గురువారం నుంచి ఆస్ట్రేలియాతో మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుండగా.. ఈ మ్యాచ్‌‌లో భారత్ గెలిస్తే..? తొలి నాలుగు టెస్టుల్లోనూ కెప్టెన్‌గా భారత్‌ని గెలిపించిన రెండో కెప్టెన్ రికార్డుల్లో రహానె నిలవనున్నాడు.

కెప్టెన్‌గా తొలి నాలుగు టెస్టుల్లోనూ మహేంద్రసింగ్ సింగ్ ధోనీ అప్పట్లో టీమిండియాని గెలిపించగా.. అంతకముందు ఆ తర్వాత కూడా ఆ రికార్డ్‌‌ని ఏ భారత కెప్టెన్ కూడా అందుకోలేకపోయాడు. తాజాగా హ్యాట్రిక్ విజయాలతో ఉన్న రహానె.. సిడ్నీ టెస్టులోనూ భారత్ జట్టుని గెలిపిస్తే..? ధోనీ సరసన సగర్వంగా నిలవనున్నాడు.

2017లో తొలిసారి ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌కి కెప్టెన్సీ వహించిన అజింక్య రహానె.. ఆ తర్వాత 2018లో అఫ్గానిస్థాన్‌తో జరిగిన టెస్టుకీ నాయకత్వం వహించాడు. ఇటీవల మెల్‌బోర్న్ వేదికగా మళ్లీ ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో టీమిండియాని నడిపించిన అజింక్య.. సిడ్నీలోనూ టీమ్‌కి కెప్టెన్‌గా ఉండబోతున్నాడు.

నాలుగు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ముగియగా.. భారత్, ఆస్ట్రేలియా చెరొక టెస్టులో గెలిచాయి. దాంతో మూడో టెస్టులో గెలిచి ఆధిక్యాన్ని అందుకోవాలని ఇరు జట్లూ ఉవ్విళ్లూరుతున్నాయి.





Untitled Document
Advertisements