శుభమన్ గిల్‌పై లబుషేన్ స్లెడ్జింగ్

     Written by : smtv Desk | Fri, Jan 08, 2021, 02:05 PM

శుభమన్ గిల్‌పై లబుషేన్ స్లెడ్జింగ్

టీమిండియా యువ ఓపెనర్ శుభమన్ గిల్‌పై ఆస్ట్రేలియా ఫీల్డర్ మార్కస్ లబుషేన్ స్లెడ్జింగ్‌కి దిగాడు. సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో రోహిత్ శర్మ (26: 77 బంతుల్లో 3x4, 1x6)తో కలిసి శుభమన్ గిల్ (50: 101 బంతుల్లో 8x4) బ్యాటింగ్ చేస్తుండగా.. షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేసిన లబుషేన్ పదే పదే ఓ ప్రశ్నని అడుగుతూ గిల్ ఏకాగ్రతని దెబ్బతీసే ప్రయత్నం చేశాడు. ఒకసారి అతని ప్రశ్నకి సమాధానం ఇచ్చిన శుభమన్ గిల్ ఆ తర్వాత మౌనంగా ఉండిపోయాడు.

ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్ చేయగా.. ఆ ఓవర్‌లో గిల్‌ ఏకాగ్రతని దెబ్బతీసేందుకు లబుషేన్ నోరు జారుతూ వచ్చాడు. ‘‘ఫేవరెట్ ప్లేయర్.. నీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు..?’’ అని గిల్‌ని ఉద్దేశిస్తూ లబుషేన్ గట్టిగా అడిగాడు. దాంతో.. శుభమ్ గిల్ ‘‘మ్యాచ్ ముగిసిన తర్వాత చెప్తాను’’ అని సమాధానమిచ్చాడు. కానీ.. అంతటితో ఆగని లబుషేన్ ‘‘మ్యాచ్ ముగిసిన తర్వాత..? సచిన్ టెండూల్కర్..? బహుశా విరాట్ కోహ్లీ..?’’ అని మళ్లీ ప్రశ్నించాడు. కానీ.. గిల్ మాత్రం ఆ తర్వాత అతనికి సమాధానం ఇవ్వలేదు. టెస్టు కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేసిన గిల్ ఆ వెంటనే ఔటయ్యాడు.

మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ నమోదు చేసిన గిల్.. తొలి వికెట్‌కి రోహిత్ శర్మతో కలిసి 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. టెస్టుల్లో భారత్ జట్టుకి దాదాపు 13 ఇన్నింగ్స్‌ల తర్వాత తొలి వికెట్‌కి ఈరోజు 50 పరుగుల భాగస్వామ్యం లభించింది. ఇన్నింగ్స్ 33వ ఓవర్‌ వేసిన పాట్ కమిన్స్ బౌలింగ్‌లో కామెరూన్ గ్రీన్‌కి క్యాచ్ ఇచ్చి గిల్ ఔటయ్యాడు. అప్పటికి టీమిండియా స్కోరు 85.







Untitled Document
Advertisements