ఎల్‌బీ నగర్‌లో నిరసనలు...ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టు

     Written by : smtv Desk | Fri, Jan 08, 2021, 02:17 PM

ఎల్‌బీ నగర్‌లో నిరసనలు...ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టు

హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్‌లో యుగ తులసీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గో సడక్ బంద్ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. ఆవులను రక్షించాలని, గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని యుగ తులసీ ఫౌండేషన్ నిర్వహకులు శుక్రవారం సడక్ బంద్‌కు పిలుపునిచ్చాయి. దాంతో ఫౌండేషన్ సభ్యులు, హిందూ సంఘాల నాయకులు, కార్యకర్తలు ఎల్బీనగర్ చౌరస్తాకు భారీగా చేరుకొని నినాదాలు చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి యుగ తులసీ ఫౌండేషన్ సభ్యులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు.

అయితే, ఈ గో సడక్ బంద్‌లో పాల్గొనేందుకు వచ్చిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన్ను తరలించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న గోవధను అరికట్టాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. కర్నాటకలో ఏ విధంగా ఆవును రాష్ట్రీయ జంతువుగా ప్రకటించారో.. అదే విధంగా తెలంగాణలో కూడా ప్రకటన చేయాలని, ఒక హిందువుగా ప్రభుత్వాన్ని అడుగుతున్నానని అన్నారు. కేసీఆర్ నిజమైన హిందువైతే ఈ పని చేయాలని డిమాండ్ చేశారు. గోవులను రక్షించకపోతే ఈ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని రాజాసింగ్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అంశంపై స్పందించాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. భాగ్యనగర్ ఉత్సవ సమితి అధ్యక్షుడు భగవంతరావును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు, ఈ అరెస్టుల్లో భాగంగా పోలీసులు ఫౌండేషన్‌కు చెందిన మహిళా కార్యకర్తల వెంట ఉన్న పిల్లలను, రోడ్డు మీదుగా వెళ్తున్న సామాన్య ప్రజలను, షాపుల్లో పనిచేసే పని వారిని కూడా అరెస్ట్ చేస్తున్నారని నిరసన కారులు ఆరోపించారు. దాంతో సామాన్య ప్రజలు పోలీసులతో వాగ్వావాదానికి కూడా దిగారని ఆరోపించారు. రోడ్డు మీద వెళ్తున్న ఒక యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకోగా తనను ఎందుకు తీసుకెళ్తున్నారని యువకుడు పోలీసులను నిలదీశాడు. కాసేపు వాదన తర్వాత పోలీసులు యువకుడ్ని విడిచిపెట్టారు. దీంతో పోలీసుల తీరును జనాలు తప్పుబడుతున్నారు. పోలీసులు, ఫౌండేషన్ సభ్యులు, కార్యకర్తలతో ఎల్బీ నగర్ చౌరస్తాలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు నిలిచిపోయాయి.





Untitled Document
Advertisements