కరోనా భయం...ఏకంగా విమానంలోని సీట్లన్నింటినీ బుక్ చేసుకున్నాడు

     Written by : smtv Desk | Fri, Jan 08, 2021, 02:19 PM

కరోనా భయం...ఏకంగా విమానంలోని సీట్లన్నింటినీ బుక్ చేసుకున్నాడు

కరోనా వైరస్ ఏడాది కాలంగా మనిషికి ఎక్కాడాలేని క్రమశిక్షణ, పరిశుభ్రత నేర్పింది. ఆరుబయటకి వెళ్లాల్సి వస్తే మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులకు శానిటైజర్ పూజుకోవడం ఇప్పుడు మన జీవితంలో భాగమైంది. ఇక ఎక్కడికైనా ప్రయాణాలు చేయాల్సి వస్తే.. మరి కొంత రక్షణ కోసం పీపీఈ కిట్లు కూడా ధరిస్తున్నారు. అయితే.. ఇండోనేషియాకు చెందిన ఓ వ్యక్తి మాత్రం కరోనా నుంచి రక్షణ కోసం విమానంలోని సీట్లన్నింటినీ బుక్ చేసుకున్నాడు. ఆ ప్రయాణికుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఫొటో వైరల్ అవుతోంది.

జకార్తాకు చెందిన రిచర్డ్‌ ముల్జాదీ అనే సోషలిస్టు ఇటీవల బాలీకి వెళ్లారు. రిచర్డ్ వెంట అతడి భార్య షల్విన్నీ ఛాంగ్‌ కూడా ఉన్నారు. ఈ ప్రయాణం కోసం ఆయన లయన్‌ ఎయిర్‌ గ్రూప్‌నకు చెందిన బాటిక్‌ ఎయిర్‌ విమానంలో అన్ని టికెట్లనూ బుక్‌ చేసుకున్నారు. విమానంలో ఇతర ప్రయాణికులు ఉంటే వారి నుంచి కరోనా సోకే ప్రమాదం ఉందని ఇలా చేసినట్లు రిచర్డ్ తెలిపారు.

విమానంలో ఉన్న ఫోటోను రిచర్డ్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్‌ చేశారు. ‘ఫ్లైట్‌లో సీట్లన్నీ బుక్‌ చేశా.. అయినా, ప్రైవేట్‌ జెట్ కంటే తక్కువే ఖర్చయ్యింది. మాకు కరోనా సోకే ప్రమాదం లేదు. విమానంలో నేను, నా భార్య మాత్రమే ఉన్నాం’ అని ఆయన రాసుకొచ్చారు.

విమానంలోని సీట్లన్నీ బుక్ చేయడానికి ఎంత ఖర్చయ్యిందనే వివరాలను మాత్రం రిచర్డ్ చెప్పలేదు. విమానం మొత్తం బుక్ చేసుకున్నా.. ప్రైవేట్ జెట్‌లో ప్రయాణ ఛార్జీల కంటే తక్కువే అయిందని ఆయన చెప్పడం గమనార్హం. రిచర్డ్ చేసిన పనికి ఆయన భార్య ఛాంగ్ చాలా సంతోషానికి గురై ఉండొచ్చు..!





Untitled Document
Advertisements