Test Day2: భారత ఓపెనర్లు మెరుగైన ఆరంభం

     Written by : smtv Desk | Fri, Jan 08, 2021, 02:32 PM

Test Day2: భారత ఓపెనర్లు మెరుగైన ఆరంభం

భారత్, ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. శుక్రవారం ఓవర్‌నైట్ స్కోరు 166/2తో తొలి ఇన్నింగ్స్‌ని కొనసాగించిన ఆస్ట్రేలియా జట్టు 338 పరుగులకి ఆలౌటైంది. ఆ జట్టులో స్టీవ్‌స్మిత్ (131: 226 బంతుల్లో 16x4) సెంచరీ నమోదు చేయగా.. మార్కస్ లబుషేన్ (91: 196 బంతుల్లో 11x4) విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ జట్టు ఈరోజు ఆట ముగిసే సమయానికి 96/2తో నిలిచింది. క్రీజులో కెప్టెన్ అజింక్య రహానె (5 బ్యాటింగ్: 40 బంతుల్లో), చతేశ్వర్ పుజారా (9 బ్యాటింగ్: 53 బంతుల్లో) ఉన్నారు. టీమిండియా ఇంకా 242 పరుగుల ఆస్ట్రేలియా కంటే తొలి ఇన్నింగ్స్‌లో వెనకబడి ఉంది.

ఆస్ట్రేలియా ఆలౌట్‌ తర్వాత భారత ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన ఓపెనర్లు రోహిత్ శర్మ (26: 77 బంతుల్లో 3x4, 1x6), శుభమన్ గిల్ (50: 101 బంతుల్లో 8x4) తొలి వికెట్‌కి 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి శుభారంభమిచ్చారు. ఆరంభంలోనే పోటీపడుతూ బౌండరీలు బాదిన ఈ జోడీ.. ఫుల్ షాట్లతో అదరగొట్టింది. కానీ.. టీమ్ స్కోరు 70 వద్ద రోహిత్ శర్మ ఔటవగా.. అనంతరం కొద్దిసేపటికే హాఫ్ సెంచరీ నమోదు చేసిన శుభమన్ గిల్ ఆ వెంటనే ఔటైపోయాడు. దాంతో 85/2తో భారత్ ఇబ్బందుల్లో పడింది.

15 పరుగుల వ్యవధిలో ఓపెనర్ల వికెట్లు చేజారడంతో అనంతరం వచ్చిన చతేశ్వర్ పుజారా, అజింక్య రహానె.. రక్షణాత్మకంగా బ్యాటింగ్ చేశారు. మరోవైపు ఆస్ట్రేలియా బౌలర్లు కూడా కట్టుదిట్టంగా లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేయడంతో.. స్కోరు బోర్డు నెమ్మదించింది. ఎంతలా అంటే..? ఒకానొక దశలో పుజారా 30 బంతుల్లో కనీసం ఒక్క పరుగు కూడా చేయలేదు. మొత్తంగా ఈరోజు 45 ఓవర్లు ఆడిన భారత్ 96 పరుగులు చేయగా.. గురువారం 55 ఓవర్లు ఆడిన ఆస్ట్రేలియా 2 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేయడం గమనార్హం.





Untitled Document
Advertisements