జడేజా బుల్లెట్ త్రో...స్మిత్ రనౌట్

     Written by : smtv Desk | Fri, Jan 08, 2021, 02:35 PM

జడేజా బుల్లెట్ త్రో...స్మిత్ రనౌట్

ఫీల్డింగ్‌లో తనకి తిరుగులేదని టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మరోసారి నిరూపించాడు. ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో బౌలింగ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టిన రవీంద్ర జడేజా.. సెంచరీ బాదిన స్టీవ్‌స్మిత్ (131: 226 బంతుల్లో 16x4)ని కళ్లుచెదిరే రీతిలో రనౌట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 338 పరుగులకి ఆలౌటవగా.. స్టీవ్‌స్మిత్ చివరి వికెట్.

ఓవర్‌నైట్ వ్యక్తిగత స్కోరు 31 పరుగుల వద్ద ఈరోజు బ్యాటింగ్‌ని కొనసాగించిన స్టీవ్‌స్మిత్.. టెయిలెండర్లతో కలిసి దూకుడుగా ఆడేశాడు. భారత బౌలర్లలో ఎవరినీ లెక్క చేయకుండా.. అందరి బౌలింగ్‌లోనూ స్వేచ్ఛగా బ్యాట్ ఝళిపించేశాడు. ఈ క్రమంలో కెరీర్‌లో 27వ టెస్టు సెంచరీ మార్క్‌ని అందుకున్న స్టీవ్‌స్మిత్.. చివర్లో మరింతగా రెచ్చిపోయాడు. మరీ ముఖ్యంగా.. టెయిలెండర్లకి ఎక్కువగా స్ట్రైక్ ఇవ్వకుండా తానే బాధ్యత తీసుకుంటూ వచ్చాడు. కానీ.. ఆ తాపత్రయమే అతడి కొంపముంచింది.

ఇన్నింగ్స్ 106వ ఓవర్ వేసిన జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో బంతిని పాయింట్ దిశగా స్టీవ్‌స్మిత్ హిట్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ.. బ్యాట్ అంచు తాకిన బంతి బ్యాక్‌వర్డ్ స్వ్కేర్ లెగ్ దిశగా వెళ్లింది. దాంతో.. సింగిల్ పూర్తి చేసిన స్టీవ్‌స్మిత్.. స్ట్రైకింగ్ కోసం సాహసోపేతంగా డబుల్‌కి హేజిల్‌వుడ్ (1 నాటౌట్: 6 బంతుల్లో)ని పిలిచాడు. అయితే.. స్వ్కేర్ లెగ్ నుంచి బంతిని వేగంగా అందుకున్న జడేజా కళ్లుచెదిరే రీతిలో వికెట్ కీపర్ ఎండ్‌ వైపు వికెట్లపైకి నేరుగా విసిరాడు. అప్పటికే వికెట్ల వద్దకి బంతి కోసం రహానె అక్కడికి చేరుకున్నా.. బంతి నేరుగా స్టంప్స్‌పైకి వస్తుండటంతో దాన్ని టచ్ చేయలేదు. బంతి వికెట్లని తాకే సమయానికి క్రీజుకి చాలా దూరంలో స్మిత్ ఉండిపోయాడు.







Untitled Document
Advertisements