ఒకేసారి ఇద్దరి మెడలో తాళి కట్టాడు

     Written by : smtv Desk | Fri, Jan 08, 2021, 02:39 PM

ఒకేసారి ఇద్దరి మెడలో తాళి కట్టాడు

ఒకే పెళ్లి మండపంపై ఒకేసారి ఇద్దరు అమ్మాయిల మెడలో తాళి కట్టాడు ఓ యువకుడు. అంతేకాదు, శుభలేఖలోనూ ఆ ఇద్దరు యువతులను పెళ్లి చేసుకుంటున్నట్లు వేయించాడు. 500 మంది అతిథుల సమక్షంలో ఆ ఇద్దరి మెడలో తాళి కట్టాడు. ఆ తర్వాత ఆ జంటను.. సారీ, సారీ.. ముగ్గురు కదా, జంట అనలేం.. ఆ భర్తా భార్యలను అతిథులందరూ ఆశీర్వదించారు. (ఏమని దీవించారని మాత్రం అడగొద్దు). ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో జరిగిన ఈ పెళ్లి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పెళ్లి ఫోటోలు, శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆ యువకుడు ఇద్దరు యువతులతోనూ ప్రేమలో పడటం.. ఆ విషయం తెలిసినా వారు ముగ్గురూ కలిసి జీవించడానికి నిర్ణయించుకోవడంతో ఈ వింత పెళ్లి జరిగింది. అలాగని ఆ యువకుడు ఏ కోటీశ్వరుడో, లక్షాధికారి కుమారుడో అనుకునేరు.. ఒక సాధారణ రైతు. మూడేళ్ల కిందట మొగ్గ తొడిగిన అతడి ప్రేమ ప్రస్థానం ఇలా సాగింది..

బస్తర్ జిల్లా జగదల్పూర్ పరిధిలోని తిక్రాలొహంగా గ్రామానికి చెందిన చందూ మౌర్య (24) వ్యవసాయం చేస్తూ కుటుంబానికి అండగా ఉంటున్నాడు. మూడేళ్ల కిందట అతడు తొకపాల్ ప్రాంతంలో విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసే పని నిమిత్తం వెళ్లాడు. అక్కడ పనిచేస్తుండగా అతడికి గిరిజన యువతి సుందరి కశ్యప్‌ (21) తో పరిచయం ఏర్పడింది. తొలి చూపులోనే వారి చూపులు కలిశాయి. వారిద్దరూ ప్రేమలో పడటానికి ఎంతో కాలం పట్టలేదు.

చందు, సుందరి తరచూ ఫోన్లో మాట్లాడుకునే వారు. వీలు చిక్కినప్పుడల్లా కలుసుకునే వారు. వీరి ప్రేమ వ్యవహారం ఇలా కొనసాగుతుండగా.. ఏడాది తర్వాత, హసీనా బాగేల్ (20) అనే యువతి చందు గ్రామంలో జరిగిన ఓ వివాహ వేడుకలో పాల్గొనడానికి వచ్చింది. చందూ మళ్లీ ప్రేమలో పడ్డాడు. హసీనాకు కూడా చందూను చూడగానే నచ్చేశాడు. ఒకరి నంబర్ మరొకరు షేర్ చేసుకున్న వాళ్లిద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకునేవారు.
ఉన్నట్టుండీ ఒక రోజు హసీనా.. చందూపై తనకున్న ప్రేమను వ్యక్తపరిచింది. దీంతో అతడు సుందరితో తన ప్రేమ విషయాన్ని చెప్పాడు. అయినప్పటికీ చందూపై తన ప్రేమను చంపుకోలేకపోయిన హసీనా అతడితో తరచూ మాట్లాడేది.

ఈలోగా హసీనా ఇంట్లో ఆమెకు పెళ్లి సంబంధాలు చూసే పనిలో పడ్డారు పెద్ద వాళ్లు. ఈ పరిణామంతో హసీనా ఉన్నట్టుండి ఒక రోజు చెప్పాపెట్టకుండా చందూ ఇంటికి వచ్చేసింది. ఇక అతడితోనే ఉంటానని తేల్చి చెప్పింది. ఈ విషయం తెలుసుకున్న సుందరి వెంటనే తన ప్రియుడి ఇంటికి వచ్చేసింది. తాను కూడా అక్కడ నుంచి కదిలేది లేదని చెప్పేసింది.

రోజులు గడుస్తున్న కొద్దీ వాళ్లు ఒకర్నొకరు అర్థం చేసుకున్నారు. చందూను ఏ ఒక్కరూ వదులుకునే పరిస్థితిలో లేరు కాబట్టి.. ఇద్దరూ అతడితోనే ఉందామని నిర్ణయించుకున్నారు. అందుకు చందూ ఇంట్లోనూ అభ్యంతరం చెప్పలేదు.
చందూ, సుందరి, హసీనా.. ఒకర్నొకరు అర్థం చేసుకొని చక్కగా సహజీవనం చేస్తున్నారు. కానీ, గ్రామంలోని వారికి అనేక సందేహాలు. ఆ ప్రశ్నలు, సూటిపోటి మాటలు చందూను ఉక్కిరిబిక్కిరి చేశాయి. దీంతో ఓ నిర్ణయానికి వచ్చాడు. గ్రామస్థులు, అతిథుల సమక్షంలో సుందరి, హసీనాను పెళ్లి చేసుకోవాలని భావించాడు. అనుకున్నదే తడవుగా ఆ విషయం పెద్దలకు చెప్పి ముహూర్తం పెట్టించాడు.
హసీనా తల్లిదండ్రులు ఈ పెళ్లికి హాజరయ్యారు. వాళ్లు ముగ్గురూ కలిసి ఉండటం పట్ల తమకేమీ అభ్యంతరం లేదని చెప్పారు. అంతేకాదు.. ఇదేమంత ఆశ్చర్యకరమైన విషయం కూడా కాదని అన్నారు. సుందరి తల్లిదండ్రులు మాత్రం ఈ పెళ్లికి రాలేదు. ‘ఈ రోజు నా తల్లితండ్రులు రాలేదు. కానీ, పరిస్థితులు ఎప్పటికైనా మారుతాయి. నేనూ, చందు, హసీనా సంతోషంగా ఉన్నాం. మేం ఎప్పటికీ కలిసే ఉంటాం..’ అని సుందరి భావోద్వేగంగా చెప్పింది.





Untitled Document
Advertisements