అతి త్వరలో పుణే నుంచి వ్యాక్సిన్ల ప్రక్రియ మొదలు

     Written by : smtv Desk | Fri, Jan 08, 2021, 02:41 PM

అతి త్వరలో పుణే నుంచి వ్యాక్సిన్ల ప్రక్రియ మొదలు

దేశ ప్రజలకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ శుభవార్త చెప్పారు. కొవిడ్ వ్యాక్సిన్ల రవాణా ప్రారంభం కానుందని తెలిపారు. దేశవ్యాప్తంగా 41 కేంద్రాల ద్వారా కరోనా వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో మంత్రి హర్షవర్దన్ గురువారం (జనవరి 7) అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖ మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. విర్చువల్ ద్వారా జరిగిన ఈ భేటీలో టీకాకు సంబంధించిన అంశాలపై చర్చించారు. గురువారం సాయంత్రం నుంచి లేదా శుక్రవారం ఉదయం నుంచి

వ్యాక్సిన్ల తరలింపు ప్రక్రియ మొదలవుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

పుణేలోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి కరోనా వ్యాక్సిన్ల తరలింపు ప్రక్రియ మొదలవుతుందని మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్లు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయని వెల్లడించారు. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా రూపొందించిన కొవిడ్ వ్యాక్సిన్‌ను భారత్‌లో కొవిషీల్డ్ పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చారు. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఈ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తోంది. ఇక కొవాగ్జిన్‌ను హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ రూపొందించిన సంగతి తెలిసిందే.

పుణే నుంచి ప్రత్యేక విమానాల్లో కరోనా వ్యాక్సిన్లను దేశవ్యాప్తంగా ఆయా నిల్వ కేంద్రాలకు తరలించనున్నట్లు మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ఇందుకోసం ప్రయాణికుల విమానాలను వినియోగిస్తున్నట్లు తెలిపారు. రెండు, మూడు రోజుల్లో వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. తొలుత కరోనా యోధులకు, అత్యవసరం ఉన్నవారికే టీకాలు ఇస్తారు.

కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న రీత్యా అప్రమత్తంగా ఉండాలని ఆయా రాష్ట్రాలకు హర్షవర్ధన్ సూచించారు. మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్‌గఢ్‌లో కేసులు మళ్లీ పెరుగుతున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రతి ఒక్కరికీ టీకా అందిస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. వ్యాక్సిన్‌పై చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మట్లేదని ఆయన పేర్కొన్నారు.





Untitled Document
Advertisements