సోనూ సూద్‌పై పోలీసులకు మున్సిపల్ కార్పొరేషన్ ఫిర్యాదు

     Written by : smtv Desk | Fri, Jan 08, 2021, 02:42 PM

సోనూ సూద్‌పై పోలీసులకు మున్సిపల్ కార్పొరేషన్ ఫిర్యాదు

ప్రముఖ నటుడు సోనూ సూద్‌పై ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జుహూ ప్రాంతంలో త‌న ఆరు అంత‌స్తుల నివాస‌ భ‌వ‌నాన్ని అనుమ‌తులు లేకుండా ఆయన హోట‌ల్‌గా మార్చారని పోలీసులకు ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదులో బృహాన్ ముంబై మునిసిప‌ల్ కార్పొరేష‌న్ (బీఎంసీ) పేర్కొంది. సోనూ సూద్‌పై తక్షణమే ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాలని బీఎంసీ కోరింది.

ఈ విషయంలో ఇప్పటికే ఆయనకు బీఎంసీ నోటీసులు పంపినా సోనూ స్పందించకపోవడంతో ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే, చట్టవిరుద్ధంగా ఆ భ‌వ‌న నిర్మాణంలో మార్పులు చేసినట్టు తెలిపింది. ఫిర్యాదులో సోనూ సహా ఆయన భార్య సొనాలీ సూద్‌ పేరును కూడా చేర్చారు. ఇప్ప‌టికే ఆ భవనాన్ని రెండుసార్లు పరిశీలించి, నిబంధనల గురించి సోనూసూద్‌కి వివరించిన‌ప్ప‌టికీ ఆయ‌న ప‌ట్టించుకోలేద‌ని తెలిపింది. తొలుత గతేడాది అక్టోబరు 7న సోనూసూద్‌కి నోటీసులు పంపి న‌వంబ‌రు 26లోపు స‌మాధానం చెప్పాల‌ని కోరామని బీఎంసీ చెబుతోంది. గడువులోగా ఆయన స్పందించక‌పోవ‌డంతో మ‌రింత స‌మ‌యం ఇచ్చినట్టు పేర్కొంది. ఈ నోటీసులపై సోనూ కోర్టుకు వెళ్లారని, అక్కడ ఎటువంటి ఉపశమనం లభించలేదన్నారు.

ఇటీవల జనవరి 4న మ‌రోసారి ఆ భ‌వనాన్ని ప‌రిశీలించగా.. చ‌ట్ట విరుద్ధంగా మ‌రో నిర్మాణం చేప‌ట్టార‌ని గుర్తించినట్టు తెలిపింది. ఇప్ప‌టికీ ఆయ‌న వివ‌ర‌ణ ఇవ్వ‌క‌పోడంతోనే పోలీసుల‌కు ఫిర్యాదు చేశామని బీఎంసీ వివరణ ఇచ్చింది. అయితే, ఈ ఆరోపణలను సోనూ సూద్ తోసిపుచ్చారు. హోటల్ నిర్వహణకు అవసరమైన అన్ని అనుమతులు తీసుకున్నామని, కేవలం మహారాష్ట్ర కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎంసీజెడ్ఎంఏ) క్లియరెన్స్ రావాల్సి ఉందని సోనూ అన్నారు.

‘నివాస భవనాన్ని హోటల్‌గా మార్చడానికి బీఎంసీ నుంచి అనుమతి తీసుకున్నాను.. మహారాష్ట్ర కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎంసీజెడ్ఎంఏ) క్లియరెన్స్ రావాలి.. కోవిడ్-19 కారణంగా ఈ అనుమతి ఆలస్యమయ్యింది.. ఇందులో ఎటువంటి అక్రమాలు జరగలేదు.. నేను ఎల్లప్పుడూ చట్టప్రకారం నడుచుకుంటాను.. కోవిడ్ సమయంలో కరోనా యోధుల కోసం నివాసంగా ఈ హోటల్‌ను వినియోగించాం.. ఒకవేళ అనుమతి రాకపోతే నివాస సముదాయంగానే ఉంచుతాం..బీఎంసీ నోటీసులకు బాంబే హైకోర్టును ఆశ్రయిస్తాను’అని అన్నారు. ప్ర‌స్తుతం సినిమా షూటింగ్‌లతో సోనూసూద్ సినిమా తీరికలేకుండా ఉన్నారు. కరోనా లాక్‌డౌన్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న వలస కార్మికులు, పేదలకు ఆయన చేసిన సేవలను దేశం మొత్తం కొనియాడింది. రీల్ లైఫ్‌లో విలన్‌గా నటించినా.. రియల్ లైఫ్‌లో మాత్రం ఆయన జాతీయ హీరో అయ్యారు.






Untitled Document
Advertisements