అమెరికా: ముగిసిన ట్రంప్ శకం

     Written by : smtv Desk | Fri, Jan 08, 2021, 03:01 PM

అమెరికా: ముగిసిన ట్రంప్ శకం

తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి తొలి నుంచి ఎన్నికల ప్రక్రియపై ఆరోపణలు గుప్పిస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఫలితాల తర్వాత కూడా అదే వైఖరిని ప్రదర్శించారు. ఫలితాలపై కోర్టు మెట్లెక్కినా అక్కడా చుక్కెదురయ్యింది. జార్జియాలో ఫలితాలను తారుమారు చేయడానికి వేసిన పాచిక కూడా పారలేదు. ఆయనపై ఎంతోకొంత ఉన్న అభిమానం తాజాగా క్యాపిటల్ భవనం (పార్లమెంట్)పై జరిగిన దాడితో తుడిచిపెట్టుకుపోయింది. కొన్నాళ్లుగా ట్రంప్ చేసిన ఆరోపణలు, రెచ్చగొట్టే ప్రసంగాలతో ఆయన మద్దతుదారులు రెచ్చిపోయారు. నాలుగు గంటల పాటు క్యాపిటల్ భవనంలో వీరంగం వేశారు.
అమెరికా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా క్యాపిటల్ బిల్డింగ్‌పై దాడి జరగడం, దానికి ట్రంప్ మద్దతు పలకడం, ఆందోళనకారులను అదుపు చేయడానికి పోలీసుల కాల్పులు తదితర ఘటనలు కలకాలం గుర్తుండిపోతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనను ప్రపంచదేశాలను తీవ్రంగా ఖండించాయి. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఇటువంటి దాడులు సరికాదని హితవు పలికాయి. అటు, సోషల్ మీడియాలోనూ ఈ చర్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక, ట్రంప్ అధ్యక్షుడిగా కొనసాగే నైతిక హక్కు లేదని, తక్షణమే ఆయన పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఏ క్షణమైనా ఆయన బాధ్యతల నుంచి తప్పుకోవాలని, లేకుంటే, అమెరికా చరిత్రలో ఘోరమైన అవమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. వాషింగ్టన్‌‌లో చోటుచేసుకున్న ఘటనను అన్ని దేశాలూ ప్రముఖంగా ప్రస్తావిస్తుండగా, తమ దేశం పరువు పోయిందని అమెరికా పౌరులు మండిపడుతున్నారు.

అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన క్యాపిటల్ బిల్డింగ్ మూడో అంతస్తు వరకూ నిరసనకారులు వచ్చారంటే, ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగిందని అనుమానిస్తున్నారు. ఈ చర్యలకు దిగాలని తన మద్దతుదారులకు ట్రంప్ సూచించారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆందోళనకారులను భవనంలోకి రాకుండా నిరోధించడానికి టియర్ గ్యాస్, తుపాకులను వాడాల్సి వచ్చిందంటే, ట్రంప్ ఎంత దాష్టీకం అవగతమవుతుందని అంటున్నారు.

అమెరికా చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా సెనేట్‌తో పాటు ప్రతినిధుల సభ సమావేశమైన వేళ ఆందోళనకారులు విధ్వంసానికి పాల్పడటం యావత్తు ప్రపంచాన్నే నివ్వెర పరిచాయి. రిపబ్లికన్ల కంచుకోట జార్జియా తదితర రాష్ట్రాల్లో డెమొక్రాట్లు ఆధిక్యం సాధించడంతో ట్రంప్ జీర్ణించుకోలేకపోతున్నారు. తీవర ఆగ్రహంతో రగిలిపోతూ అడ్డదారుల్లో అందలం ఎక్కడానికి ప్రయత్నించారు. ట్రంప్ వైఖరిని సొంత పార్టీ నేతలే వ్యతిరేకించారు. ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, సెనెట్ రిపబ్లికన్ నేత మిచ్ మెక్ కొన్నెల్ తదితరులు అయిష్టంగానే ట్రంప్‌ను సమర్దించి, ఆయన వైఖరిపై మండిపడుతున్నారు.

ట్రంప్ తీరుపై రిపబ్లికన్‌లు గుర్రుగా ఉన్నారు. రిపబ్లికన్ నేత లిజ్ చెన్నీ ఫాక్స్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ట్రంప్ నిప్పును రాజేశారు.. అమెరికా ఇలా మారుతుందని ఎవరూ ఊహించలేదు.. అధ్యక్షుడిని నిరసనకారులు ఎన్నుకోలేరు. వారిని ట్రంప్ స్వయంగా ప్రోత్సహించారు’ అని మండిపడ్డారు. ఇది అత్యంత దురదృష్టకరమైన సంఘటనని, దీన్ని సాధ్యమైనంత త్వరగా మరచిపోయే ప్రయత్నం చేయాల్సి ఉందని మరో రిపబ్లికన్ నేత, మిస్సోరీకి చెందిన సెనెటర్ రాయ్ బ్లంట్ అన్నారు.

మరోవైపు, ట్రంప్ యంత్రాంగంలో ఒక్కొక్కరూ తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ సలహాదారు మాట్ పొటింజర్, మెలానియా ట్రంప్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టెఫానీ గ్రాషిమ్, వైట్‌హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రెటరీ సారాహ్ మాథ్యూస్ తమ తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.





Untitled Document
Advertisements