పంత్ కీపింగ్ పై పాంటింగ్ ఆగ్రహం

     Written by : smtv Desk | Fri, Jan 08, 2021, 03:31 PM

పంత్ కీపింగ్ పై పాంటింగ్ ఆగ్రహం

ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ తప్పిదాలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అశ్విన్, జడేజా బౌలింగ్‌లో కీపింగ్ చేసేందుకు తీవ్రంగా ఇబ్బందిపడుతున్న రిషబ్ పంత్.. చేతుల్లో పడిన క్యాచ్‌లను కూడా నేలపాలు చేస్తున్నాడు. ఎంతలా అంటే..? ఆస్ట్రేలియా కొత్త ఓపెనర్ పకోస్కి (62: 110 బంతుల్లో 4x4).. వ్యక్తిగత స్కోరు 26, 32 పరుగుల వద్ద ఇచ్చిన రెండు క్యాచ్‌లను రిషబ్ పంత్ చేజార్చాడు. దాంతో బౌలర్లు అశ్విన్, సిరాజ్ తీవ్ర నిరాశ వ్యక్తం చేయగా.. కెప్టెన్ అజింక్య రహానె కూడా పెదవి విరుస్తూ కనిపించాడు.

రిషబ్ పంత్ తప్పిదాలపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ మాట్లాడుతూ ‘‘పకోస్కి రెండు క్యాచ్‌లను సులువుగా పంత్ ఒడిసి పట్టుకుని ఉండొచ్చు. ఒకరకంగా చెప్పాలంటే.. పంత్‌ లక్కీ అనే చెప్పాలి. ఎందుకంటే.. పకోస్కి సెంచరీ లేదా డబుల్ సెంచరీ చేయలేదు. మ్యాచ్‌‌లో పంత్ చాలా చెత్తగా కీపింగ్ చేస్తున్నాడు. ఇప్పుడే కాదు.. టెస్టుల్లోకి అరంగేట్రం చేసినప్పటి నుంచి రిషబ్ పంత్ తప్పిదాలు చేస్తూనే ఉన్నాడు. నాకు తెలిసి క్రికెట్ ప్రపంచంలో మరే వికెట్ కీపర్ కూడా రిషబ్ పంత్ వదిలేసినన్ని క్యాచ్‌లను చేజార్చి ఉండడు’’ అని రిక్కీ పాంటింగ్ వెల్లడించాడు. ఐపీఎల్‌లో రిషబ్ పంత్ ఆడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌కి రిక్కీ పాంటింగే హెడ్ కోచ్ కావడం గమనార్హం.

అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టులో సాహాని వికెట్ కీపర్‌గా ఆడించిన టీమిండియా మేనేజ్‌మెంట్.. ఆ తర్వాత మెల్‌బోర్న్, తాజాగా సిడ్నీ టెస్టులో పంత్‌కి అవకాశమిచ్చింది. కానీ.. క్యాచ్‌లను చేజార్చడం ద్వారా పంత్‌ అందరికీ ఆగ్రహం తెప్పిస్తున్నాడు.





Untitled Document
Advertisements