'తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేవాడిని'...ప్రణబ్ ముఖర్జీ

     Written by : smtv Desk | Fri, Jan 08, 2021, 03:43 PM

'తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేవాడిని'...ప్రణబ్ ముఖర్జీ

దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చివరిగా తన మరణానికి ముందు రాసిన ‘ప్రెసిడెన్సియల్ ఇయర్’ పుస్తకం మంగళవారం మార్కెట్లోకి విడుదలైంది. ఈ పుస్తకంలో పాకిస్థాన్ సంబంధాలు, ప్రత్యేక తెలంగాణ, రెండోసారి బీజేపీ అఖండ విజయం, ప్రధాని మోదీ వైఖరి సహా అనేక అంశాలను ప్రణబ్ స్పృశించారు. పాక్‌‌తో సమస్యలను సానుకూల రాజకీయ విధానంతో కాకుండా తెలివైన నిర్వహణ ద్వారా పరిష్కరించాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. 2016 సర్జికల్ స్ట్రయిక్స్ గురించి ఎక్కువ ప్రచారం చేయడం ద్వారా దేశం స్వల్పంగా లాభపడిందని పేర్కొన్నారు.

అలాగే, మోదీకి బీజేపీతో‘బలమైన స్నేహపూర్వక సంబంధాలు’ఆ పార్టీని చారిత్రాత్మక విజయం దిశగా నడిపించడం ద్వారా ప్రధాన మంత్రి పదవిని పొందగలిగారని అన్నారు. అలాగే, ప్రధాని మోదీ పార్లమెంట్లో తరచుగా మాట్లాడాలని ప్రణబ్‌ ముఖర్జీ తన ‘ప్రెసిడెన్షియల్‌ ఈయర్స్‌ 2012– 2017’ పుస్తకంలో సూచించారు. పార్లమెంటులో విపక్ష సభ్యుల భిన్నాభిప్రాయాలను ప్రధాని వినాలని, తన అభిప్రాయాలను వివరించి, వారిని ఒప్పించాలని కోరారు. ఏ ప్రధాన మంత్రైనా.. సభలో ఉంటే చాలు, సభ నిర్వహణ వేరుగా ఉంటుంది’ అని పేర్కొన్నారు.
దివంగత మాజీ ప్రధానులు జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరా గాంధీ, వాజ్‌పేయి, మన్మోహన్‌ సింగ్‌.. వీరంతా సభలో తమదైన ముద్ర వేశారని అన్నారు. ‘ప్రధాని మోదీ తన పూర్వ ప్రధానుల నుంచి ఈ విషయంలో స్ఫూర్తి పొందాలి. స్పష్టమైన నాయకత్వాన్ని చూపాలి. తన అభిప్రాయాలను వ్యక్తపరిచేందుకు పార్లమెంటును వేదికగా వినియోగించుకోవాలి’ అని సూచించారు.
యూపీఏ ప్రభుత్వ హయాంలో స్వపక్ష, విపక్ష నేతలతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ క్లిష్ట సమస్యలను పరిష్కరించేవాడినని.. సభ సజావుగా సాగడమే తన ప్రథమ లక్ష్యంగా ఉండేదని వివరించారు. కానీ, దురదృష్టవశాత్తూ ఎన్డీయే-1 ప్రభుత్వంలో ఈ స్ఫూర్తి కొరవడింది.. ఇదే సమయంలో విపక్షం కూడా దారుణంగా విఫలమయ్యిందన్నారు.

పార్లమెంట్లో గందరగోళం కొనసాగడం వల్ల ప్రభుత్వం కన్నా విపక్షమే ఎక్కువ నష్టపోతుందని అన్నారు. దీన్ని సాకుగా చూపి సభా సమయాన్ని కుదించే అవకాశం ప్రభుత్వానికి లభిస్తుందన్నారు. దేశం ప్రధాని పాలనపైననే ఆధారపడి ఉంటాయన్నారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకునే పనిలో నిమగ్నుడై ఉండే పరిస్థితి మన్మోహన్‌ సింగ్‌దని, దాంతో ఆ ప్రభావం పాలనపై పడిందని ప్రణబ్‌ విశ్లేషించారు.

‘పాకిస్థాన్‌తో సంబంధాలు, విధానాలను భారత్ చాలా జాగ్రత్తగా, తెలివిగల నిర్వహణతో అనుసరించాలి.. సానుకూల రాజకీయ విధానం ద్వారా మాత్రం కాదు. పాక్ నిరంతర దురాక్రమణకు ప్రతిస్పందనగా సరిహద్దులో భారత దళాలు నిర్వహించే సర్జికల్ స్ట్రయిక్స్ సాధారణ సైనిక కార్యకలాపాలు.. కానీ వాటి గురించి ఎక్కువగా ప్రచారం చేయాల్సిన అవసరం లేదు.. 2016 నుంచి భారత సైన్యం పాక్ భూభాగంలో రెండు దాడులు చేసిన తర్వాత ప్రచారం ఎక్కువయ్యింది. దీని ద్వారా వచ్చే ప్రయోజం ఏమీ ఉండదు’ అన్నారు. ‘నాటి పాక్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ వ్యక్తిగత కార్యక్రమం కోసం ప్రధాని నర్రేంద మోదీ లాహోర్‌కు వెళ్లడం సరైన నిర్ణయం కాదు.. నాకు అవకాశం ఇస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేవాడిని... తనచేతుల మీదుగా రెండు రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్‌ విభజన జరుగుతుందనే విషయాన్ని తాను ఏ మాత్రం ఊ హించలేకపోయాను’ ఆయన ఈ పుస్తకంలో పేర్కొన్నారు. ‘యూపీఏ-2లో ఆర్ధిక మంత్రిగా కొనసాగితే.. మమతా బెనర్జీ కూటమిలోనే కొనసాగేలా చర్యలు తీసుకునేవాడిని’ అని అన్నారు. ‘ప్రతి ప్రధానికి ఒక్కో శైలి ఉంటుందని, ఒకే పార్టీకి చెందిన వ్యక్తులైనా నెహ్రూతో పోల్చితే లాల్ బహుదూర్ శాస్త్రిది భిన్నమైన విధానం.. భారత్-నేపాల్ సంబంధాల విషయంలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది’ అని ప్రణబ్ పేర్కొన్నారు.





Untitled Document
Advertisements