బోయిన్‌పల్లి కిడ్నాప్: తెరపైకి కొత్త పేరు...మాదల శ్రీను అలియాస్ శ్రీనివాస్ చౌదరి

     Written by : smtv Desk | Fri, Jan 08, 2021, 03:46 PM

బోయిన్‌పల్లి కిడ్నాప్: తెరపైకి కొత్త పేరు...మాదల శ్రీను అలియాస్ శ్రీనివాస్ చౌదరి

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన బోయిన్‌పల్లి కిడ్నాప్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఆ కేసులో టీడీపీ మహిళా నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్టై జైలుకెళ్లారు. పరారీలో ఉన్న ఆమె భర్త భార్గవ్ రామ్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆయన బెంగళూరులో ఉన్నాడని తొలుత భావించినప్పటికీ.. అక్కడి నుంచి మైసూర్ వెళ్లి తలదాచుకున్నట్లు అనుమానిస్తున్నారు. ప్రత్యేక పోలీసు టీమ్‌లు ఆయన కోసం గాలిస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. ఈ కేసులో అనూహ్యంగా మరోపేరు తెరపైకి వచ్చింది. గుంటూరుకు చెందిన మాదల శ్రీను అలియాస్ శ్రీనివాస్ చౌదరి కిడ్నాప్‌ ముఠాకి నాయకుడిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. భూమా కుటుంబానికి దగ్గరైన శ్రీను.. అన్నీ తానై నడిపిస్తున్నట్లు సమాచారం. కిడ్నాప్ ఎలా చేయాలి.. ఎలా వెళ్లాలి అనే విషయాలపై సినీ ఫక్కీలో స్కెచ్ గీశాడని.. అతని ముఠా సభ్యులు కిడ్నాప్ చేశారన్న ప్రచారం జరుగుతోంది. అందుకోసం శ్రీనగర్ కాలనీలో ఐటీ అధికారుల్లా కనిపించేందుకు డ్రెస్‌లు కూడా అద్దెకు తీసుకున్నట్లు తెలిసింది.

గుంటూరుకు చెందిన శ్రీను భూమా అఖిల ప్రియ భర్త భార్గవ రామ్‌కు రైట్‌హ్యాండ్‌గా చెబుతున్నారు. అఖిల ప్రియ కుటుంబానికి నమ్మదగ్గ.. కీలక అనుచరుడిగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీను లైఫ్‌స్టైల్ కూడా చర్చనీయాంశంగా మారింది. సరదాల కోసం హెలికాప్టర్లలో వెళ్లేంత విలాసవంతమైన జీవితం గడుపుతుంటాడని సమాచారం. నంద్యాల ఉపఎన్నికలోనూ గుంటూరు శ్రీను కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. మాదల శ్రీను పేరుతో పాటు మాజీ మంత్రి అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్‌తో అతి సన్నిహితంగా ఉన్న ఫొటోలు బయటకు రావడంతో వైరల్‌‌గా మారాయి. భూమా కుటుంబంతో నమ్మకంగా ఉండేవాడని తెలుస్తోంది. గుంటూరులో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ ర్యాలీల్లో పాల్గొన్న ఫొటోలు కూడా లీకవడంతో స్థానికంగా టీడీపీలో చురుకుగా ఉండేవాడని భావిస్తున్నారు. మాదల శ్రీను గత నేరచరిత్రపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ముఠా నాయకుడి కోసం ఇప్పటికే ఏపీలోని గుంటూరు సహా నాలుగు రాష్ట్రాల్లో గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం. పరిటాల రవి హత్య కేసులో ముద్దాయిగా ఉన్న మొద్దు శ్రీనుది గుంటూరు జిల్లానే కావడం యాదృచ్ఛికం.





Untitled Document
Advertisements