ఐపీఎల్ ఫ్రాంఛైజీలకి డెడ్‌లైన్

     Written by : smtv Desk | Fri, Jan 08, 2021, 05:12 PM

ఐపీఎల్ ఫ్రాంఛైజీలకి  డెడ్‌లైన్

ఐపీఎల్ 2021 సీజన్‌కి సంబంధించి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కసరత్తుల్ని ప్రారంభించింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా.. ఈ వారం ఆరంభంలో వర్చువల్‌గా ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్‌తో సమావేశమైన కౌన్సిల్ సభ్యులు.. ఐపీఎల్ 2021 సీజన్ వేలానికి సంబంధించి ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు తాజాగా బ్రిజేశ్ పటేల్ ఓ ప్రకటనని విడుదల చేశాడు. ఫిబ్రవరి రెండో వారంలో ఐపీఎల్ 2021 సీజన్‌ మినీ వేలం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

‘‘ఐపీఎల్ టోర్నీలోని ఫ్రాంఛైజీలు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాని జనవరి 21లోపు సమర్పించాలి. అలానే ట్రేడింగ్ విండో కూడా ఫిబ్రవరి 4న ముగియనుంది’’ అని బ్రిజేశ్ పటేల్ వెల్లడించాడు. ఇప్పటికే కొన్ని ఫ్రాంఛైజీలు రిటైన్ ఆటగాళ్ల జాబితాని సిద్ధం చేసి.. వేలంలోకి విడిచిపెట్టే ఆటగాళ్ల విషయంపై చర్చిస్తున్నాయి. ఐపీఎల్‌లోని ప్రతి టీమ్‌కి గరిష్ఠంగా ఆటగాళ్ల కోసం రూ.85 కోట్లు ఖర్చు పెట్టే సౌలభ్యం ఉండగా.. ఐపీఎల్ 2020 సీజన్ వేలం తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ వద్ద కేవలం రూ. 15 లక్షలు మాత్రమే ఉన్నాయి. దాంతో.. ఐపీఎల్ 2021 సీజన్ వేలానికి ముందు కేదార్ జాదవ్ (రూ. 7.8 కోట్లు), పీయూస్ చావ్లా (రూ. 6.75 కోట్లు)లను విడిచి పెట్టేయాలని చెన్నై నిర్ణయించినట్లు తెలుస్తోంది. అదే జరిగితే..? చెన్నై సుమారు రూ.14.7 కోట్లతో ఈ ఏడాది వేలంలోకి రానుంది.

రాజస్థాన్ రాయల్స్ వద్ద రూ. 14.75 కోట్లు ఉండగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ వద్ద రూ. 10.1 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద రూ. 9 కోట్లు, కోల్‌కతా నైట్‌రైడర్స్ వద్ద రూ. 8.5 కోట్లు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వద్ద రూ. 6.4 కోట్లు ఉన్నాయి. ఐపీఎల్ 2020 సీజన్ విజేత ముంబయి ఇండియన్స్ ఎక్కువ మంది ఆటగాళ్లని అట్టిపెట్టుకునేలా కనిపిస్తోంది.





Untitled Document
Advertisements