కోవిడ్ టీకాలను త్వరగా పంపాలంటూ ప్రధాని మోదీకి బ్రెజిల్ అధ్యక్షుడి లేఖ

     Written by : smtv Desk | Sat, Jan 09, 2021, 12:52 PM

కోవిడ్ టీకాలను త్వరగా పంపాలంటూ ప్రధాని మోదీకి బ్రెజిల్ అధ్యక్షుడి లేఖ

కరోనా వైరస్‌కు తాను టీకా వేయించుకోనని ప్రకటించి తీవ్ర విమర్శపాలైన బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో.. అదే నోటితో ఇప్పుడు వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పడం గమనార్హం. బ్రెజిల్‌లో కరోనా వైరస్ మహమ్మారి విలయానికి అధ్యక్షుడి నిర్లక్ష్య వైఖరే కారణమని ప్రజలు, ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా మరణాలు చోటుచేసుకున్న దేశాల జాబితాలో అమెరికా తర్వాతి స్థానంలో బ్రెజిల్ ఉంది. ఇప్పటివరకు అక్కడ 2 లక్షల మందికి పైగా కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

ఈ నేపథ్యంలో కోవిడ్ టీకాలను వీలైనంత త్వరగా పంపాలంటూ భారత ప్రధాని నరేంద్రమోదీకి ఆయన లేఖ రాశారు. ఈ మేరకు ఆయన కార్యాలయం మోదీరిక రాసిన లేఖను వెల్లడించింది. ‘మా దేశంలో అత్యవసరంగా ఇమ్యూనైజేషన్‌ ప్రొగ్రామ్‌ను అమలు చేయాల్సిన ఆవశ్యకత ఉంది.. అందువల్ల భారత్‌లోని ఆస్ట్రాజెనెకా- ఆక్స్‌ఫర్డ్ (కొవిషీల్డ్‌) నుంచి ఆర్డర్‌ చేసుకున్న 2 మిలియన్ల డోసులను వీలైంతన త్వరగా పంపించగలరు’ అని బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారో ఆ లేఖలో పేర్కొన్నారు.

కరోనా మరణాలు భారీగా నమోదుకావడంతో తక్షణమే టీకా పంపిణీని చేపట్టాలని బొల్సొనారోపై ఒత్తిడి నానాటికీ పెరుగుతోంది. బ్రెజిల్‌కు చెందిన కొన్ని ప్రైవేటు సంస్థలు భారత్‌లోని ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా టీకా ఉత్పత్తి చేసే సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నాయి.

బ్రెజిల్‌లో కరోనా తీవ్ర రూపం దాల్చినా బొల్సొనారో మాత్రం అమెరికా అధ్యక్షుడి మాదిరిగా వైరస్‌ను తక్కువచేసి చూశారు. ఆయనకు కరోనా వైరస్ సోకినా మాస్క్‌ కూడా ధరించలేదు. అంతేకాదు, తన దేశ ప్రజలకు టీకా అవసరం లేదంటూ నోరుజారి కోరి విమర్శలను కొని తెచ్చుకున్నారు. తనపై ముప్పేట దాడి జరగడంతో దిగిరాకతప్పలేదు.

‘బ్రెజిల్‌లోని ఆస్ట్రాజెనెకా కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను మిలియన్ల డోస్‌లను నింపడానికి, పూర్తి చేయడానికి అవసరమైన క్రియాశీల పదార్థాలు గత శనివారం దేశానికి చేరుకోవాల్సి ఉంది కానీ, ఈ నెలాఖరు వరకు అవి చేరకపోవచ్చు’ అంటూ ప్రభుత్వ నిధులతో నడిచే బ్రెజిల్‌కు చెందిన ఫియోక్రూజ్ బయోమెడికల్ సెంటర్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే మోదీకి రాసిన లేఖను బోల్సొనారో కార్యాలయం బయటపెట్టింది.

అయితే, బ్రెజిల్‌కు పంపే టీకా డోస్‌లకు అవసరమైన ముడిపదార్థాలు సిద్ధమయ్యాయి.. కానీ, చైనా నుంచి ఎగుమతి లైసెన్స్ కోసం ఎదురుచూస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.





Untitled Document
Advertisements