గోవా బీచ్‌లో మద్యం తాగితే రూ.10వేల జరిమానా

     Written by : smtv Desk | Sat, Jan 09, 2021, 12:55 PM

గోవా బీచ్‌లో మద్యం తాగితే రూ.10వేల జరిమానా

పర్యాటకుల నిర్వాకం వల్ల బీచ్‌ల్లో వ్యర్ధాలు పేరుకుపోవడంతో గోవా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బీచ్‌లో ఆల్కహాల్ సేవించడానికి అనుమతించబోమని స్పష్టం చేసింది. ఈ నిబంధనలను ఉల్లంఘించి, బీచుల్లో తాగితే రూ.10 వేల జరిమానా విధించనున్నట్టు గోవా పర్యాటక శాఖ తెలిపింది. కొత్త సంవత్సర వేడుకల తర్వాత గోవా బీచుల్లోని అనేక ప్రాంతాలు మద్యం తాగి పడేసిన సీసాలతో నిండిపోయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పర్యాటక శాఖకు చెందిన ఓ అధికారి శుక్రవారం తెలిపారు.

అలాగే, బీచుల్లో మద్యం సేవించవద్దని హెచ్చరించే బోర్డులను ఏర్పాటు చేసినట్టు గోవా టూరిజం డైరెక్టర్‌ మెనినో డిసౌజా పేర్కొన్నారు. బీచ్‌లలో తాగితే వ్యక్తులకు రూ.2 వేలు, బృందాలకు రూ.10వేల జరిమానా విధించేలా 2019 జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం టూరిస్ట్‌ ట్రేడ్‌ యాక్ట్‌ను సవరించినట్టు చెప్పారు. ‘పోలీసుల ద్వారా సవరించిన ఈ చట్టాన్ని అమలు చేయనున్నాం.. టూరిస్ట్ పోలీస్ ఫోర్స్‌ను ఏర్పాటుచేసుకున్న తర్వాత తామే స్వంతంగా ఆ పనిని నిర్వహిస్తాం’ అని డిసౌజా పేర్కొన్నారు.

గోవా.. పేరు చెబితే చాలు.. మందుబాబుల ఆనందంతో గంతులు వేస్తారు. అక్కడ మద్యం తక్కువ ధరకు లభించడంతోపాటు బీచ్‌లలో ఎంజాయ్ చేస్తూ... పూర్తిగా విదేశాలకు వెళ్లిన అనుభూతి కలుగుతుంది. అయితే, గతేడాది నుంచి మద్యం ధరలను 20% -50% శాతం వరకు గోవా ప్రభుత్వం పెంచింది. ఇటీవల, బీచ్‌ల‌లో జెల్లీ ఫిష్‌లు పర్యాటకుల్ని కరిచి భయపెడుతున్నాయి. దీంతో ప‌ర్యాట‌కులకు స‌హాయం అందించేందుకు బీచ్‌ల దగ్గర లైఫ్ సేవ‌ర్స్‌ను ఏర్పాటు చేశారు.





Untitled Document
Advertisements