డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతా శాశ్వతంగా తొలగింపు

     Written by : smtv Desk | Sat, Jan 09, 2021, 01:04 PM

డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతా శాశ్వతంగా తొలగింపు

ఎన్నికల్లో ఓటమిని అంగీకరించని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మద్దతుదారులను క్యాపిటల్ భవనంపై దాడికి ఉసిగొల్పినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన రెచ్చగొట్టే చర్యలతోనే హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ సంచలన నిర్ణయం తీసుకుంది. ట్రంప్ ట్విట్టర్ ఖాతాను శాశ్వతంగా తొలగిస్తున్నట్టు ప్రకటించింది. భవిష్యత్తులో హింసాత్మక ఘటనల ముప్పు పొంచి ఉందని పేర్కొంది. బుధవారం క్యాపిటల్ భవనంపై దాడి జరిగిన తర్వాత ట్రంప్ ఖాతాను 12 గంటల పాటు నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన ట్విట్టర్.. ఒకవేళ నిబంధనలను ఉల్లంఘిస్తే శాశ్వతంగా నిలిపివేస్తామని హెచ్చరించిన విషయం తెలిసిందే.

ఇటీవల డొనాల్డ్ ట్రంప్ తన ఖాతాలో చేసిన ట్వీట్లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్విట్టర్ తన బ్లాగ్‌లో వివరణ ఇచ్చింది. ‘భవిష్యత్తులో హింస చెలరేగే ప్రమాదం ఉన్నందున ఆయన ఖాతాను శాశ్వతంగా రద్దుచేశామని’ ప్రకటించింది. అంతకు ముందు, 12 గంటల నిషేధం ముగియడంతో గురువారం ట్విట్టర్ ఖాతా ద్వారా ట్రంప్ ఓ వీడియో సందేశం పంపారు. తన మద్దతుదారుల వల్ల కలిగిన అల్లకల్లోలం తరువాత ఉద్రిక్తతలను శాంతింపజేయడం లక్ష్యంగా ట్వీట్ చేశారు.

తన శకం ముగిసిందని, ఎన్నికల్లో విజయం సాధించిన వ్యక్తికి సాఫీగా అధికార బదలాయింపునకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. అయితే, జో బైడెన్‌కు శుభాకాంక్షలు చెప్పడం గానీ, ఆయన పేరును గానీ ప్రస్తావించలేదు. తదుపరి చర్య అవసరమా అని నిర్ధారించడానికి ట్రంప్ సోషల్ మీడియా కార్యకలాపాలపై పరిశీలన కొనసాగుతోందని ట్విట్టర్ తెలిపింది. శుక్రవారం ట్రంప్ చేసిన రెండు ట్వీట్ల తర్వాత ఆయన ఖాతాను నిలిపివేయాలనే నిర్ణయానికి వచ్చింది.

‘నా మద్దతుదారులు ఎవరికీ అగౌరవం ఉండదు’ అని ఓ ట్వీట్.. ‘జనవరి 20న జరిగే బైడెన్ ప్రమాణస్వీకారానికి హాజరుకాబోను’ అంటూ మరో ట్వీట్ చేశారు. ‘అమెరికాలో ఇటీవల చోటుచేసుకుంటున్న విస్తృత సంఘటనల నేపథ్యంలో, హింసను ప్రేరేపించడంతో సహా వివిధ వర్గాలను అధ్యక్షుడి ప్రకటన సమీకరించగలదని ఈ రెండు ట్వీట్లను తప్పక పరిగణనలోకి తీసుకోవాలి’ ట్విట్టర్ పేర్కొంది. హింసను నిరోధించే నిబంధనలను ఈ ట్వీట్లు ఉల్లంఘించినట్టు భావించి.. డొనాల్డ్ ట్రంప్ ఖాతాను తక్షణమే తమ సేవల నుంచి శాశ్వతంగా రద్దుచేయాలని నిర్ణయించామని తెలిపింది. అధ్యక్షుడు ట్రంప్ మద్దతుదారులు జరిపిన ‘తిరుగుబాటు’ వల్ల తాము బాధపడుతున్నామని చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాక్ డోర్సేకు వందలాది మంది ఉద్యోగులు సంతకం చేసినట్లు ట్విట్టర్ ధ్రువీకరించింది. అంతేకాదు, బుధవారం నాటి హింసలో ట్విట్టర్ కీలక పాత్ర పోషించిందని ఉద్యోగులు ఆరోపించారు.





Untitled Document
Advertisements