భారత్ భూభాగంలోకి చైనా జవాన్ ఎంట్రీ

     Written by : smtv Desk | Sat, Jan 09, 2021, 03:18 PM

భారత్  భూభాగంలోకి చైనా జవాన్ ఎంట్రీ

చైనా సైనికుడొకరు భారత్ భూభాగంలోకి వచ్చారు. అతడు పొరపాటున నియంత్రణ రేఖ దాటి వచ్చినట్లు భావిస్తున్నారు. చైనా జవాన్‌ను భారత్ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. అతడికి పరీక్షలు నిర్వహించి, విచారిస్తున్నట్లు సమాచారం. విచారణ అనంతరం.. అతడు పొరపాటున నియంత్రణ రేఖ దాటి వచ్చినట్లు తేలితే, చైనాకు తిరిగి అప్పగించనున్నట్లు ఇండియన్ ఆర్మీ వర్గాలు శనివారం (జనవరి 9) తెలిపాయి.


లడఖ్‌లోని ఛూషుల్ సెక్టార్ పరిధిలోని గురుంగ్ కొండ ప్రాంతంలో శుక్రవారం ఉదయం చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA)కి చెందిన సైనికుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఇండియన్ ఆర్మీ వర్గాలు తెలిపాయి. అతడు దారితప్పి భారత్ భూభాగంలోకి వచ్చినట్లు భావిస్తున్నామని వెల్లడించాయి. అతడిని శనివారం గానీ, ఆదివారం గానీ చైనాకు అప్పగించే అవకాశం ఉందని తెలిపాయి.

గతేడాది అక్టోబర్‌ 20న లడఖ్‌లోని డెమ్‌చుక్ ప్రాంతంలోనూ ఇలాగే చైనాకు చెందిన జవాన్ కార్పోరల్ వాంగ్ యా లాంగ్.. భారత భూభాగంలోకి వచ్చాడు. ఆ సమయంలో అతడితో పాటు చైనా ఆర్మీకి సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంట్లు కలిగి ఉన్నాడు. విచారణ అనంతరం అతడు పొరపాటున భారత్ భూభాగంలో అడుగు పెట్టినట్లు గుర్తించిన భారత భద్రతా దళాలు మరుసటి రోజు అతడిని చైనా ఆర్మీకి అప్పగించాయి.





Untitled Document
Advertisements