మూడో టెస్టులో భారత్‌కి నిరాశే

     Written by : smtv Desk | Sat, Jan 09, 2021, 03:42 PM

మూడో టెస్టులో భారత్‌కి నిరాశే

ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత్‌కి శనివారం నిరాశే ఎదురైంది. ఓవర్‌నైట్ స్కోరు 96/2తో ఈరోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ జట్టు 244 పరుగులకే ఆలౌటవగా.. 94 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా టీమ్ శనివారం ఆట ముగిసే సమయానికి 103/2తో నిలిచింది. ఇప్పటికే 197 పరుగుల ఆధిక్యంలో ఆస్ట్రేలియా కొనసాగుతుండగా.. ఆదివారం రెండో సెషన్ తర్వాత ఆ జట్టు ఇన్నింగ్స్‌ని డిక్లేర్ చేసే అవకాశం ఉంది.

భారత్ జట్టు ఆలౌట్ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియాకి ఫాస్ట్ బౌలర్ సిరాజ్, స్పిన్నర్ అశ్విన్ వరుసగా పంచ్‌లిచ్చారు. ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో ఓపెనర్ పకోస్కి (10: 16 బంతుల్లో 2x4)ని మహ్మద్ సిరాజ్ బోల్తా కొట్టించగా.. పదో ఓవర్‌లో మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (13: 29 బంతుల్లో 1x4)ని ఎల్బీడబ్ల్యూగా అశ్విన్ ఔట్ చేసేశాడు. దాంతో 35/2తో ఆస్ట్రేలియా ఇబ్బందుల్లో పడింది. కానీ.. ఆ తర్వాత వచ్చిన స్టీవ్‌స్మిత్ (29 బ్యాటింగ్: 63 బంతుల్లో 3x4)తో కలిసి బాధ్యతాయుతంగా ఆడిన మార్కస్ లబుషేన్ (47 బ్యాటింగ్: 69 బంతుల్లో 6x4) మూడో వికెట్‌కి అజేయంగా 68 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ జోడీని విడదీసేందుకు పదే పదే కెప్టెన్ రహానె బౌలర్లని మార్చినా ఫలితం లేకపోయింది.

అంతకముందు ఓవర్‌నైట్ వ్యక్తిగత స్కోరు 5 పరుగులతో రహానె, 9 రన్స్‌తో పుజారా బ్యాటింగ్‌ని కొనసాగించారు. ఈరోజు 10 ఓవర్ల పాటు నిలకడగా ఆడిన ఈ జోడీ.. టీమ్ స్కోరు 117 వద్ద విడిపోయింది. పాట్ కమిన్స్ బౌలింగ్‌లో బంతిని వికెట్లపైకి ఆడుకుని అజింక్య రహానె (22: 70 బంతుల్లో 1x4, 1x6) ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన హనుమ విహారి (4: 38 బంతుల్లో) లేని పరుగు కోసం ప్రయత్నిస్తూ హేజిల్‌వుడ్ డైరెక్ట్ త్రో విసరడంతో రనౌటయ్యాడు. దాంతో.. భారత్ జట్టు 142/4తో ఇబ్బందుల్లో పడింది.

ఈ దశలో రిషబ్ పంత్ (36: 67 బంతుల్లో 4x4)తో కలిసి భారత్ ఇన్నింగ్స్‌ని నడిపించిన పుజారా (50: 176 బంతుల్లో 5x4) హాఫ్ సెంచరీ సాధించి ఆ వెంటనే ఔటయ్యాడు. ఇక అక్కడి నుంచి భారత్ వేగంగా వికెట్లు చేజార్చుకుంది. దూకుడుగా ఆడే ప్రయత్నం చేసిన అశ్విన్ (10: 15 బంతుల్లో 2x4) రనౌటవగా.. నవదీప్ సైనీ (3) స్టార్క్ బౌలింగ్‌లో మాథ్యూవెడ్‌కి చిక్కాడు. ఆ తర్వాత బుమ్రా (0) కూడా రనౌటవగా.. చివరి వికెట్ మహ్మద్ సిరాజ్ (6: 10 బంతుల్లో 1x4) కమిన్స్ బౌలింగ్‌లో కీపర్ పైనీకి క్యాచ్ ఇచ్చి ఔటైపోయాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో పాట్ కమిన్స్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. హేజిల్‌వుడ్ రెండు, మిచెల్ స్టార్క్‌కి ఒక వికెట్ దక్కింది.





Untitled Document
Advertisements