సిడ్నీలో సిరాజ్ పై జాత్యంహకార వ్యాఖ్యలు

     Written by : smtv Desk | Sat, Jan 09, 2021, 05:35 PM

సిడ్నీలో సిరాజ్ పై జాత్యంహకార వ్యాఖ్యలు

భారత్, ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో వివాదం చోటు చేసుకుంది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌ని ఉద్దేశిస్తూ ఆస్ట్రేలియా అభిమానులు జాత్యంహకార వ్యాఖ్యలు చేశారు. బౌండరీ లైన్‌ వద్ద సిరాజ్ ఫీల్డింగ్ చేస్తుండగా.. స్టేడియంలోకి మ్యాచ్ చూసేందుకు వచ్చిన అభిమానుల్లో ఓ గుంపు మద్యం సేవించి సిరాజ్‌పై దూషణకి దిగినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. వెంటనే సిరాజ్ ఆ విషయాన్ని కెప్టెన్ అజింక్య రహానె దృష్టికి తీసుకెళ్లగా.. ఫీల్డ్ అంపైర్లకి టీమిండియా తరఫున అతను ఫిర్యాదు చేశాడు. సిడ్నీ టెస్టులో మూడో రోజైన శనివారం ఓపెనర్ పకోస్కి వికెట్‌ని ఆరంభంలోనే మహ్మద్ సిరాజ్ పడగొట్టిన విషయం తెలిసిందే.

క్రికెటర్లపై అభిమానులు ఇలా జాత్యంహకార వ్యాఖ్యలు చేయడం ఇదేమీ తొలిసారి కాదు. గత ఏడాది ఇంగ్లాండ్, వెస్టిండీస్ మధ్య టెస్టు సిరీస్ జరుగుతున్న సమయంలో.. ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జోప్రా ఆర్చర్‌పై అక్కడి అభిమానులు జాత్యంహకార వ్యాఖ్యలు చేశారు. 13 ఏళ్ల క్రితం భారత్, ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ వేదికగానే టెస్టు మ్యాచ్ జరగగా.. ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తనని కోతి అని సంబోధించినట్లు అప్పట్లో ఆల్‌రౌండర్ ఆండ్రూ సైమండ్స్ ఫిర్యాదు చేశాడు. దాంతో.. హర్భజన్ సింగ్‌పై నిషేధం విధించగా.. అతనికి మద్దతుగా నిలిచిన భారత జట్టు ఆ నిషేధాన్ని ఎత్తివేయకపోతే సిరీస్‌ని బహిష్కరిస్తామని హెచ్చరించింది. అప్పట్లో అదో పెద్ద వివాదం. మొత్తానికి హర్భజన్ సింగ్‌ తప్పు చేయలేదని ఆ నిషేధాన్ని ఎత్తివేశారు.

సిడ్నీలో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా కేవలం 25 శాతం మంది ప్రేక్షకుల్ని మాత్రమే స్టేడియంలోకి క్రికెట్ ఆస్ట్రేలియా అనుమతిస్తోంది. సామాజిక దూరం పాటిస్తూ మాస్క్‌లు ధరించాలని వారిని ఆ దేశ క్రికెట్ బోర్డు ఆదేశించింది. టీమిండియా ఫిర్యాదుతో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) సమగ్ర విచారణ జరిపే అవకాశం ఉంది.





Untitled Document
Advertisements