ఆ దేశంలో తొలి కరోనా కేసు

     Written by : smtv Desk | Mon, Jan 11, 2021, 06:16 PM

ఆ దేశంలో తొలి కరోనా కేసు

కరోనా వైరస్ పుట్టి, ప్రపంచ దేశాల్లో గందరగోళానికి కారణమై ఏడాది గడుస్తున్నా.. నేటికీ కొన్ని దేశాల్లో ఆ వైరస్ జాడ లేదు. ఆయా దేశాల నైసర్గిక స్వరూపం, ప్రత్యేక పరిస్థితులకు తోడు, కొవిడ్-19 మహమ్మారి తమ దేశంలో అడుగుపెట్టుకుండా వారు తీసుకుంటున్న జాగ్రత్తలే అందుక్కారణం. అలాంటి దేశాల్లో మైక్రోనేషియా ఒకటి. కానీ, అది నిన్నటి వరకే. ఎందుకంటే.. తాజాగా ఆ దేశంలో తొలి కరోనా కేసు నమోదైంది.

పసిఫిక్ మారుమూల దేశమైన మైక్రోనేషియాలో సోమవారం (జనవరి 10) తొలి కొవిడ్ కేసు నమోదైంది. ఈ వార్త ఆ దేశ ప్రజలకు ఉలికిపాటుకు గురిచేసంది. అయితే.. ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆ దేశ అధ్యక్షుడు డేవిడ్ పాన్యులో స్పష్టం చేశారు. ఈ కరోనా కేసును దేశ సరిహద్దుల వద్దే కట్టడి చేశామని తెలిపారు.
ఫిలిప్పైన్స్‌లో మరమ్మతులో ఉన్న ఓ ప్రభుత్వ నౌకలోని సిబ్బందికి కరోనా సోకిందట. అందులో మైక్రోనేషియాకు చెందిన వ్యక్తి ఒకరున్నారు. అతడితో పాటు మిగిలిన ఉద్యోగులను ఆ నౌకలోనే నిర్బంధంలో ఉంచారట. అందువల్ల పరిస్థితి అదుపులో ఉందని, ప్రజలు భయపడాల్సిన పనిలేదని మైక్రోనేషియా అధ్యక్షుడు డేవిడ్ పాన్యులో తెలిపారు. పాఠశాలలు, చర్చిలు తెరిచే ఉంటాయని, దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థలు తమ కార్యకలాపాలను యథావిధిగా కొనసాగించుకోవచ్చునని భరోసా ఇచ్చారు.
మైక్రోనేషియా దేశ జనాభా సుమారు లక్ష మంది. అంటే మన హైదరాబాద్ కంటే తక్కువేనన్నమాట. మైక్రోనేషియాతో పాటు పసిఫిక్ ద్వీప దేశాలు కరోనా వైరస్‌ను అడ్డుకోవడంలో చురుగ్గా వ్యవహరించాయి. ప్రపంచ దేశాల్లో వైరస్ తొలి కేసులు నమోదవుతున్న సమయంలోనే తమ సరిహద్దులను మూసివేశాయి. పర్యాటకంపై ఆధారపడిన ఆయా దేశాలు ఈ కారణంగా ఆదాయాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అయినా.. వెనక్కి తగ్గలేదు.
మైక్రోనేషియా అనేది ఓ చిన్న ద్వీపం. దీంతో పాటు వనౌటు, సాల్మన్, మార్షల్, సమోవా, ఇప్పటివరకు కరోనా చొరబడని ప్రాంతాలుగా ఉండేవి. కానీ, ఇప్పుడు ఇవన్నీ ఆ గుర్తింపును కోల్పోయాయి. ఆయా దేశాల్లో ఒకట్రెండు కేసులు నమోదయ్యాయి. అది కూడా ఇతర ప్రాంతాలకు వెళ్లొచ్చిన వారి వల్లే. అయితే.. సమూహ వ్యాప్తి మాత్రం లేదు. కిరిబతి, నౌరు, పలావు, టోంగా, తువలు లాంటి మరికొన్ని దేశాల్లో ఇప్పటివరకుకరోనా వైరస్ అడుగుపెట్టకపోవడం విశేషం.





Untitled Document
Advertisements