ట్రంప్‌ను శాశ్వతంగా రాజకీయాల నుంచి సాగనంపడానికి రంగం సిద్దం????

     Written by : smtv Desk | Mon, Jan 11, 2021, 06:18 PM

ట్రంప్‌ను శాశ్వతంగా రాజకీయాల నుంచి సాగనంపడానికి రంగం సిద్దం????

అమెరికా చరిత్రలోనే అత్యంత అప్రతిష్ఠను మూటగట్టుకున్న అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ నిలిచిపోయారు. ఎన్నికల్లో ఓటమిని అంగీకరించని ట్రంప్.. తన చేష్టలతో అధ్యక్ష పీఠానికి తలవంపులు తెచ్చేలా ప్రవర్తించారు. క్యాపిటల్ భవనంపై ఆయన మద్దతుదారులు దాడికి పాల్పడిన ఘటన యావత్తు ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. ఈ నేపథ్యంలో ట్రంప్‌ను శాశ్వతంగా రాజకీయాల నుంచి సాగనంపడానికి రంగం సిద్ధమవుతోంది. గడువుకు ముందే ఆయనను పదవి నుంచి తొలగించి ప్రక్రియ ప్రారంభమయ్యింది.

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను అభిశంసించేందుకు ప్రతినిధుల సభ సిద్ధంగా ఉందని స్పీకర్ నాన్సీ పెలోసీ వ్యాఖ్యానించారు. తన పాలనలో చివరి రోజుల్లో ఆయనను పదవిలో కొనసాగించాలని అత్యధికులు భావించడంలేదని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 25వ సవరణ ద్వారా ట్రంప్‌ను తొలగించే తీర్మానం సోమవారం నాడు సభ ముందుకు రానుందని ఆమె తెలిపారు.
ఈ చట్ట సవరణ ద్వారా ట్రంప్‌ను తొలగించేందుకు ప్రస్తుత ఉపాధ్యక్షుడు, సెనేట్ అధ్యక్షుడిగా ఉన్న మైక్‌పెన్స్ అంగీకరించకుంటే, అభిశంసన అధికరణ ద్వారా ఆయనను తొలగించే దిశగా చర్యలు చేపడతామని పెలోసీ స్పష్టం చేశారు. అమెరికాలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ట్రంప్ అధ్యక్ష పదవికి అనర్హుడని, ఇంక ఎంతమాత్రం ఆయన అధికారంలో కొనసాగే అర్హతలేదని ఆమె వ్యాఖ్యానించారు.
కాగా, 2019 డిసెంబరులోనే ప్రతినిధుల సభలో ట్రంప్‌పై అభిశంసన తీర్మానాన్ని డెమొక్రాట్లు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. డెమొక్రాట్లు ఆధిపత్యం కలిగిన ప్రతినిధుల సభలో ఈ తీర్మానం నెగ్గినా.. సెనెట్‌లో రిపబ్లికన్లకు మెజారిటీ ఉన్న కారణంగా అక్కడ ఆమోదం పొందలేదు.
ఎన్నికల్లో విజయం సాధించిన డెమొక్రాటిక్ నేత జో బైడెన్ గెలుపును ధ్రువీకరించడానికి అమెరికా కాంగ్రెస్ సమావేశం ఏర్పాటుచేయగా.. క్యాపిటల్ బిల్డింగ్‌పై ట్రంప్ మద్దతుదారులు దాడి చేశారు. ట్రంప్ స్వయంగా తన మద్దతుదారులను ఈ దాడికి ఉసిగొల్పారని కూడా వార్తలు వచ్చాయి.
అయితే, అభిశంసన చేయాలంటే అందుకు పెద్ద ప్రసహనం ఉంది. ప్రధానంగా ఇది రెండంచెల పద్ధతి. మొదట ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టి ఓటింగ్‌ చేస్తారు. అభిశంసన అనేది క్రిమినల్‌ కేసుతో సమానం. సాధారణ మద్దతుతో ఈ తీర్మానం ఆమోదం పొందితే దాన్ని సెనేట్‌కు పంపిస్తారు. అక్కడ కూడా దీనిపై చర్చ జరుగుతుంది. అభిశంసన మేనేజర్లను నియమించి వాదనలు వింటారు. అధ్యక్షుడికి తన వాదన వినిపించుకునే అవకాశం ఇస్తారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ విచారణను పరిశీలిస్తారు. సెనేట్‌లో అభిశంసన తీర్మానాన్ని ఆమోదించాలంటే మూడింట రెండొంతుల మెజార్టీ అవసరం.





Untitled Document
Advertisements