IPL 2021 వేలంలో స్టీవ్ స్మిత్...కెప్టెన్ ని వదులుకున్న రాజస్థాన్?!

     Written by : smtv Desk | Mon, Jan 11, 2021, 08:52 PM

IPL 2021 వేలంలో స్టీవ్ స్మిత్...కెప్టెన్ ని వదులుకున్న రాజస్థాన్?!

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌స్మిత్ వివాదం ముదురుతోంది. భారత్‌తో సిడ్నీ వేదికగా సోమవారం ముగిసిన మూడో టెస్టు మ్యాచ్‌లో రిషబ్ పంత్ గార్డ్ మార్క్‌ని బ్రేక్ సమయంలో దొంగగా స్టీవ్‌స్మిత్ చెరిపేయడం స్టంప్ కెమెరాలో రికార్డైంది. దాంతో.. మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు కూడా స్మిత్‌ తీరుపై పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు. అతను క్రీడాస్ఫూర్తి తప్పి వ్యవహరించాడంటూ కొందరు విమర్శిస్తుండగా.. 2018లో ఇలాంటి పని (బాల్ టాంపరింగ్) చేసే ఏడాది నిషేధం ఎదుర్కొన్న విషయాన్ని గుర్తి చేసి మరీ మొట్టికాయలు వేస్తున్నారు. మొత్తంగా ఇప్పుడు స్టీవ్‌స్మిత్.. క్రికెట్ ప్రపంచం ముందు ఓ దోషిగా మిగిలాడు. దాంతో.. ఐపీఎల్ 2021 సీజన్‌కి కెప్టెన్‌గా స్టీవ్‌స్మిత్‌ని కొనసాగించకూడదని రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ నిర్ణయించుకున్నట్లు తాజాగా ఓ వార్త వెలుగులోకి వచ్చింది.



అసలు ఏం జరిగిందంటే..? సిడ్నీ టెస్టులో ఈరోజు లంచ్ బ్రేక్ తర్వాత రిషబ్ పంత్, చతేశ్వర్ పుజారా కంటే కొన్ని నిమిషాలు ముందు మైదానంలోకి ఆస్ట్రేలియా టీమ్ వచ్చింది. ఈ క్రమంలో స్లిప్‌లో ఫీల్డింగ్ చేసేందుకు వికెట్ల సమీపానికి వచ్చిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌స్మిత్.. అనంతరం క్రీజులోకి వచ్చి రిషబ్ పంత్ అప్పటి వరకూ గీసుకున్న గార్డ్ మార్క్‌ని కాళ్లతో చెరిపేశాడు. స్మిత్ అటు ఇటూ చూసి గార్డ్ మార్క్‌ దొంగగా చెరిపేయడం స్టంప్ కెమెరాలో రికార్డైంది. స్మిత్ అలా మార్క్ చెరిపేసిన తర్వాత క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్.. తన గార్డ్ మార్క్ కనబడకపోవడంతో మళ్లీ ఫీల్డ్ అంపైర్ సాయం తీసుకుని గీసుకోవాల్సి వచ్చింది. అప్పటి వరకూ రిషబ్ పంత్ (97: 118 బంతుల్లో 12x4, 3x6) ఆస్ట్రేలియా బౌలర్లపై ఆధిపత్యం చెలాయించడంతో అతని బ్యాటింగ్ లయని దెబ్బతీయాలనే ఉద్దేశంతో స్మిత్ అలా కుట్ర చేసినట్లు తెలుస్తోంది.
ఏడాది నిషేధం కారణంగా ఐపీఎల్ 2018 సీజన్‌కి దూరమైన స్టీవ్‌స్మిత్.. ఐపీఎల్ 2019 సీజన్ మధ్యలో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్సీ బాధ్యతల్ని రహానె చేతి నుంచి అందుకున్నాడు. ఆ తర్వాత ఐపీఎల్ 2020 సీజన్‌కి కూడా కెప్టెన్‌గా కొనసాగిన స్మిత్.. ఆడిన 14 మ్యాచ్‌ల్లో 311 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లోని ఫ్రాంఛైజీలు అట్టిపెట్టుకునే ఆటగాళ్లు, విడిచిపెట్టే ఆటగాళ్ల జాబితాని జనవరి 20లోపు సమర్పించాల్సి ఉండగా.. ఫిబ్రవరి 11న మినీ వేలం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.





Untitled Document
Advertisements