ఆసీస్ టూర్ నుంచి హనుమ విహారి ఔట్

     Written by : smtv Desk | Tue, Jan 12, 2021, 09:56 AM

ఆసీస్ టూర్ నుంచి హనుమ విహారి ఔట్

ఆస్ట్రేలియా టూర్ నుంచి భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ హనుమ విహారి తప్పుకున్నాడు. సిడ్నీ వేదికగా సోమవారం ముగిసిన మూడో టెస్టు మ్యాచ్‌లో దాదాపు మూడు గంటలు సహనంతో క్రీజులో నిలిచిన విహారి (23 నాటౌట్: 161 బంతుల్లో 4x4).. మ్యాచ్‌ని భారత్ జట్టు డ్రాగా ముగించడంలో క్రియాశీలక పాత్ర పోషించాడు. ఇన్నింగ్స్‌ మధ్యలో అతని తొడ కండరాలకి గాయమవగా.. ఫిజియో సాయం తీసుకున్న విహారి.. అనంతరం పెయిన్ కిల్లర్స్ వెసుకుని తన బ్యాటింగ్‌ని కొనసాగించి ప్రశంసలు అందుకున్నాడు. విహారి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ.

ఈరోజు మ్యాచ్ ముగిసిన తర్వాత హనుమ విహారిని నేరుగా ఆసుపత్రికి తీసుకెళ్లిన టీమిండియా మెడికల్ స్టాఫ్.. అతని గాయానికి స్కానింగ్ తీయించారు. నొప్పి కారణంగా బ్యాటింగ్ సమయంలో వికెట్ల మధ్య అసౌకర్యంగా విహారి పరుగెత్తుతూ కనిపించాడు. స్కానింగ్ రిపోర్ట్ మంగళవారం వచ్చే సూచనలు కనిపిస్తుండగా.. కొన్ని వారాల పాటు ఆటకి హనుమ విహారి దూరంగా ఉండాల్సి ఉంటుందని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో ఈ నెల 15 నుంచి 19 వరకూ బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న నాలుగో టెస్టుకి హనుమ విహారి దూరంకావడం లాంఛనంగా కనిపిస్తోంది.
భారత్, ఇంగ్లాండ్ మధ్య ఫిబ్రవరి 5 నుంచి నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభంకానుంది. తాజా గాయం నేపథ్యంలో ఈ సిరీస్‌లో కనీసం రెండు టెస్టులకి విహారి దూరంగా ఉండే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.





Untitled Document
Advertisements