ఫీల్డ్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగిన ఆస్ట్రేలియా కెప్టెన్...జరిమానా

     Written by : smtv Desk | Tue, Jan 12, 2021, 09:58 AM

ఫీల్డ్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగిన ఆస్ట్రేలియా కెప్టెన్...జరిమానా

భారత్‌తో సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఫీల్డ్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగిన ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్‌ పైనీకి జరిమానా పడింది. ఆటలో మూడో రోజైన శనివారం చతేశ్వర్ పుజారా వికెట్ కోసం డీఆర్‌ఎస్ కోరిన టిమ్ పైనీ.. నిర్ణయం తనకి వ్యతిరేకంగా రావడంతో ఫీల్డ్ అంపైర్‌ విల్సన్‌‌తో వాగ్వాదానికి దిగాడు. దాంతో.. ఆఖరిగా విల్సన్ ‘‘నేను థర్డ్ అంపైర్‌ని కాదు’’ అని గట్టిగా హెచ్చరించాల్సి వచ్చింది.

అసలు ఏం జరిగిందంటే..? ఇన్నింగ్స్ 56వ ఓవర్ వేసిన స్పిన్నర్ నాథన్ లయన్ బౌలింగ్‌లో చతేశ్వర్ పుజారా (50: 176 బంతుల్లో 5x4) బంతిని ముందుకు ఫుష్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ.. అతను ఊహించని విధంగా టర్న్, బౌన్స్ అయిన బంతి బ్యాట్‌ పక్క నుంచి వెళ్లి పుజారా శరీరాన్ని తాకి.. అనంతరం షార్ట్ లెగ్‌లో గాల్లోకి లేచింది. దాంతో అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న మాథ్యూ వెడ్ బంతిని క్యాచ్‌గా అందుకోగా.. ఔట్ కోసం ఆస్ట్రేలియా అప్పీల్ చేసింది. కానీ.. ఫీల్డ్ అంపైర్ విల్సన్ ఆ ఔట్ అప్పీల్‌ని తిరస్కరించాడు. దాంతో.. ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైనీ డీఆర్‌ఎస్ కోరాడు.



రిప్లైలో బంతి బ్యాట్‌కి తాకినట్లు హాట్‌స్పాట్, స్నికో మీటర్‌లో కనిపించలేదు. దాంతో.. థర్డ్ అంపైర్ బ్రూస్ ఆక్సన్‌ఫర్ట్ తుది నిర్ణయానికి రాలేక.. నిర్ణయాధికారం ఫీల్డ్ అంపైర్‌కే వదిలేశాడు. అప్పటికే విల్సన్ నాటౌట్ ఇచ్చి ఉండటంతో.. అతను అదే నిర్ణయానికి కట్టుబడగా.. టిమ్ పైనీ సహనం కోల్పోయి మైదానంలోనే బూతులందుకున్నాడు. పైనీ మాటల్ని విన్న అంపైర్ విల్సన్ తొలుత సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. కానీ.. టిమ్ పైనీ వినకపోవడంతో ఆఖరిగా తాను కూడా కోపంగా బదులివ్వాల్సి వచ్చింది.

టిమ్ పైనీ తీరుపై మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్‌కి ఫీల్డ్ అంపైర్లు ఫిర్యాదు చేయడంతో.. టిమ్‌పైనీ మ్యాచ్‌ ఫీజులో 15 శాతం జరిమానా విధిస్తూ రిఫరీ నిర్ణయం తీసుకున్నాడు. అంతేకాకుండా పైనీ ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్‌ని కూడా చేర్చాడు. లెవల్-1 తప్పిదం కింద గరిష్ఠంగా 50 శాతం మ్యాచ్ ఫీజుని జరిమానాగా విధించొచ్చు. అలానే ఒకటి లేదా రెండు డీమెరిట్ పాయింట్లను ఇచ్చే అధికారం రిఫరీకి ఉంటుంది.





Untitled Document
Advertisements