శరీరానికి మేలు చేసే ఆహారమే.. కీడు కూడా చేసే ప్రమాదం!!

     Written by : smtv Desk | Wed, Jan 13, 2021, 01:07 PM

శరీరానికి మేలు చేసే ఆహారమే.. కీడు కూడా చేసే ప్రమాదం!!

ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం పై శ్రద్ధ పెరిగింది. కారణం కరోనా వైరస్ భయం. ఇది కూడా ఒకవిధంగా మంచిదే అని చెప్పవచ్చు. అయితే ఒక్కోసారి అతి జాగ్రత్త కూడా ప్రాణాంతకంగా మారవచ్చు. ఒక్కోసారి శరీరానికి మేలు చేసే ఆహారమే.. కీడు కూడా చేసే ప్రమాదం ఉంది. అందుకే.. మనం ఏం తీసుకున్నా.. ‘సమతుల్యం’ తప్పకూడదని పెద్దలు చెబుతుంటారు. ప్రస్తుతం ప్రజల తీరును గమనిస్తే..వ్యాధి నిరోధక శక్తి కోసం సోషల్ మీడియాలో వచ్చే రకరకాల సూచనలను ఇంకో ఆలోచన లేకుండా పాటిస్తున్నారు. శరీరానికి మేలు చేస్తుందనే ఆలోచనతో. ‘మంచి’ ఆహారాలను మోతాదు మించి తీసుకుంటున్నారు. అయితే, డాక్టర్ సలహా లేకుండా ఏదీ ఇష్టానుసారం తీసుకోకూడదు. ఇక మనం తీసుకునే ముఖ్యమైన సప్లిమెంట్స్‌ల్లో విటమిన్-C ఒకటి. సి నిజానికి ఇది పండ్లు, కూరగాయల్లోనే లభిస్తుంది, దీని గురించి ప్రత్యేకంగా టాబ్లెట్స్ మింగాల్సిన అవసరం లేదు. అయితే, వ్యాధినిరోధక శక్తి పై అతి శ్రద్ధ పెరిగి.. చాలామంది మల్టీ విటమిన్ సప్లిమెంట్లను డాక్టర్ సలహా లేకుండా తీసుకుంటున్నారు. దీనివల్ల వల్ల చాలా నష్టం ఉంటుంది. ముఖ్యంగా విటమిన్-C అతిగా తీసుకోవడం మన శరీరానికి ఎంతో నష్టం కలిగిస్తుందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. రోజుకు 65 నుంచి 90 మిల్లీ గ్రాములు విటమిన్-సి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఉదాహరణకు.. ఒక ఆరెంజ్‌లో 51 మిల్లీ గ్రాముల విటమిన్-C ఉంటుంది. కాబట్టి రోజుకు కనీసం రెండు ఆరెంజ్‌లు తింటే శరీరానికి కావల్సినంత సప్లిమెంట్ అందుతుంది.

అయితే రోగ నిరోధక శక్తి పెంచుకోడానికి విటమిన్-సి మంచిది కదా అని అతిగా తీసుకుంటే.. లేనిపోని సమస్యలు వస్తాయి. మన శరీరం విటమిన్-సి 2000 మిల్లీగ్రాములకు తీసుకుంటుంది. అయితే, ఈ మోతాదు కొత్త సమస్యలను తెచ్చిపెడుతుంది. విటమిన్-సి ఎక్కువైతే.. తలనొప్పి, వాంతులు, డయేరియా, గుండెలో మంట, వికారం, కడుపులో తిమ్మిరి, ఇన్సోమియా (నిద్రలేమి) సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీకెప్పుడైనా ఈ లక్షణాలు కనిపిస్తే.. వెంటనే విటమిన్-సి మోతాదును తగ్గిస్తే సరిపోతుంది. లేకపోతే డాక్టర్ను తప్పకుండా సంప్రదించండి. అంతేగాక, మీరు ఇమ్యునిటీ కోసం తీసుకుంటున్న సప్లిమెంట్స్ గురించి కూడా స్పష్టంగా డాక్టర్కు తెలియజేయాలి.విటమిన్-సి శరీరానికి చాలా ముఖ్యమైనది. అన్ని పోషకాలతోపాటు దీన్ని కూడా నిత్యం మన శరీరానికి అందించాలి. దీనివల్ల మీ శరీరం ఫిట్‌గా, హెల్తీగా ఉంటుంది. అయితే, వీటిని కేవలం డాక్టర్ సలహాలతో మాత్రమే తీసుకోవాలి. ఆహారం ద్వారా పొందలేని పోషకాలను ‘సప్లిమెంట్స్’ ద్వారా భర్తీ చేస్తారనే విషయాన్ని మీరు తప్పకుండా తెలుసుకోవాలి. అంతేగానీ, అవి ఆహారానికి ప్రత్యామ్నాయం అస్సలు కాదు. కాబట్టి.. మీరు ఆహారం ద్వారా మాత్రమే శరీరానికి అవసరమైన పోషకాలను అందించండి. అలా సాధ్యం కానప్పుడు డాక్టర్ సూచనతో మాత్రమే డైట్‌ను, ఔషదాలను తీసుకోవాలి. జాగ్రత్తగా ఉండండి.. ఆరోగ్యంగా జీవించండి!!





Untitled Document
Advertisements