సీనియర్ లెవల్ క్రికెట్‌లోకి అర్జున్ టెండూల్కర్ ఎంట్రీ.... తొలి ఓవర్‌లోనే వికెట్

     Written by : smtv Desk | Sat, Jan 16, 2021, 08:42 AM

సీనియర్ లెవల్ క్రికెట్‌లోకి అర్జున్ టెండూల్కర్ ఎంట్రీ.... తొలి ఓవర్‌లోనే వికెట్

భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఎట్టకేలకి సీనియర్ లెవల్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో భాగంగా హర్యానాతో జరిగిన మ్యాచ్‌లో ముంబయి తరఫున బరిలోకి దిగిన అర్జున్.. తాను వేసిన తొలి ఓవర్‌లోనే వికెట్ పడగొట్టాడు. మొత్తంగా మ్యాచ్‌లో మూడు ఓవర్లు బౌలింగ్ చేసిన అర్జున్ 34 పరుగులివ్వడం గమనార్హం.


మ్యాచ్‌లో ఫాస్ట్ బౌలర్ ధవళ్ కులకర్ణితో కలిసి తొలి పవర్‌ప్లేలో బంతిని పంచుకున్న అర్జున్ టెండూల్కర్.. తాను వేసిన మొదటి ఓవర్‌లోనే 15 పరుగులు సమర్పించుకున్నాడు. కానీ.. ఆ ఓవర్ చివరి బంతికి హర్యానా ఓపెనర్ చైతన్య బిష్ణోయ్ (4)ని ఔట్ చేసేశాడు. ఆఫ్ స్టంప్‌‌కి వెలుపలగా అర్జున్ విసిరిన బంతిని హిట్ చేసేందుకు చైతన్య ప్రయత్నించగా.. బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి నేరుగా వికెట్ కీపర్ ఆదిత్య తారె చేతుల్లో పడింది. దాంతో.. ఔట్ కోసం అప్పీల్ చేయగా.. కొన్ని క్షణాల తర్వాత ఫీల్డ్ అంపైర్ వేలెత్తాడు. ముంబయి తరఫున లీగ్ స్టేజ్‌లో అర్జున్ టెండూల్కర్‌కి ఇదే మొదటి వికెట్.
వాస్తవానికి సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ కోసం ప్రకటించిన ముంబయి జట్టులో తొలుత అర్జున్ టెండూల్కర్‌కి చోటు లభించలేదు. కానీ.. టోర్నీ ఆరంభానికి వారం రోజుల ముందు జట్టుని 20 నుంచి 22కి మందికి పెంచుకునే వెసులబాటుని బీసీసీఐ కల్పించింది. దాంతో.. అర్జున్‌ టెండూల్కర్‌ని ముంబయి జట్టులోకి ఎంపిక చేశారు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే..? సచిన్ టెండూల్కర్ చివరిగా 2013-14లో దేశవాళీ మ్యాచ్‌ని హర్యానాపై ఆడగా.. అర్జున్ టెండూల్కర్ తాజాగా హర్యానాపై మ్యాచ్‌తోనే అరంగేట్రం చేయడం.





Untitled Document
Advertisements