దేశంలో అత్యుత్తమ సీఎంల జాబితా....తెలుగు ముఖ్యమంత్రులు ఏ స్థానంలో ఉన్నారో!!!

     Written by : smtv Desk | Sat, Jan 16, 2021, 09:05 AM

దేశంలో అత్యుత్తమ సీఎంల జాబితా....తెలుగు ముఖ్యమంత్రులు ఏ స్థానంలో ఉన్నారో!!!

దేశంలో అత్యుత్తమ సీఎంల జాబితాలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. ఆయన తర్వాతి స్థానంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. మూడో స్థానంలో ఆంధ్రా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నారు. దేశ్ కా మూడ్ పేరిట ఏబీపీ న్యూస్ - సీ ఓటర్ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

jagan-kcr
బెస్ట్ సీఎంల జాబితాలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నాలుగో స్థానంలో ఉండగా.. ఉద్ధవ్ థాక్రే ఐదో స్థానంలో, భూపేష్ బాఘల్ (ఛత్తీస్‌గఢ్) ఆరో స్థానంలో ఉన్నారు. ఏడో స్థానంలో మమతా బెనర్జీ, 8వ స్థానంలో శివరాజ్ సింగ్ చౌహన్ నిలిచారు. 9వ స్థానంలో గోవా సీఎం ప్రమోద్ సావంత్, పదో స్థానంలో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఉన్నారు. టాప్‌-10లో బీజేపీ సీఎంలు ముగ్గురు మాత్రమే ఉండటం గమనార్హం.
ఈ జాబితాలో తెలంగాణ సీఎం కేసీఆర్ చివరి నుంచి నాలుగో స్థానంలో నిలిచారు. ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ అట్టడుగున నిలవగా.. హర్యానా సీఎం ఖట్టర్ చివరి నుంచి రెండో స్థానంలో.. పంజాబ్ సీఎం అమరీందర్ కింది నుంచి మూడో స్థానంలో ఉన్నారు. అట్టడుగు నుంచి ఐదో స్థానంలో తమిళనాడు సీఎం పళనిస్వామి ఉన్నారు.
కరోనా సంక్షోభాన్ని దేశం ఎలా ఎదుర్కొంది? ప్రధాని మోదీ పాలన తీరు ఎలా ఉంది? ముఖ్యమంత్రుల పనితీరు ఎలా ఉంది? అనే అంశాలపై ఈ సర్వే జరిగింది. ఏబీపీ న్యూస్ - సీ ఓటర్.. 543 లోక్ సభ నియోజకవర్గాల్లో 30 వేల మందిని ప్రశ్నించాయి. దేశ వ్యాప్తంగా ప్రధాని మోదీ పనితీరుపై 66 శాతం మంది సంతోషం వ్యక్తం చేశారు. ఒడిశాలోని 91 శాతం మంది ప్రజలు కేంద్ర ప్రభుత్వ పనితీరు పట్ల సంతృప్తికరంగా ఉన్నారని ఈ సర్వేలో తేలడం గమనార్హం.





Untitled Document
Advertisements