విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ 100 శాతం ప్రైవేటుపరం...కేంద్ర ప్రకటన

     Written by : smtv Desk | Mon, Mar 08, 2021, 06:17 PM

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ 100 శాతం ప్రైవేటుపరం...కేంద్ర ప్రకటన

విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. ఓవైపు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న తరుణంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ షాకింగ్ ప్రకటన చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేదని తేల్చి చెప్పారు. లోక్‌సభలో విశాఖపట్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో రాష్ట్రానికి సంబంధం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో రాష్ట్రానికి ఎలాంటి ఈక్విటీ షేర్లు లేవని స్పష్టం చేశారు. ఉక్కు పరిశ్రమలో 100 శాతం పెట్టుబడులు ఉపసంహరిస్తున్న ఆమె తేల్చిచెప్పారు. తద్వారా ప్లాంట్‌ను మొత్తంగా ప్రైవేటుపరం చేయబోతున్నట్లు ప్రకటించారు. మెరుగైన ఉత్పాదకత కోసమే విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి పెంపు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. స్టీల్‌ప్లాంట్‌ అమ్మకంపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వంతో ఇప్పటికే సంప్రదింపులు జరిపామని ఆమె పేర్కొన్నారు. కాగా, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో ఏపీలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నాయి. ఉక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఇటీవల చేపట్టిన రాష్ట్ర బంద్‌ విజయవంతమైంది. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి లోక్‌సభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం తీవ్ర సంచలనంగా మారింది. 100 శాతం ప్రైవేటుపరం చేస్తున్నట్లు కేంద్ర ప్రకటించడంతో రాష్ట్ర ప్రభుత్వ తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.






Untitled Document
Advertisements