మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేయలేదు... జస్టిస్ బోబ్డే

     Written by : smtv Desk | Tue, Mar 09, 2021, 11:22 AM

మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేయలేదు... జస్టిస్ బోబ్డే

అత్యాచారానికి గురైన బాలికను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? అని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి బాబ్డే వ్యాఖ్యానించారన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన స్పందించారు. మహిళలంటే తమకు చాలా గౌరవమని, వారిని కించపరిచే వ్యాఖ్యలు చేయలేదని జస్టిస్ బోబ్డే తెలిపారు. తమ వ్యాఖ్యలను తప్పుగా ప్రచారం చేశారని ప్రధాన న్యాయమూర్తి బోబ్డే తెలిపారు. ‘‘బాధితురాలిని పెళ్లి చేసుకోమని అతడిని అడగలేదు. పెళ్లి చేసుకోబోతున్నవా అని మాత్రమే అడిగాం. అంతేకానీ ఎలాంటి ఆదేశాలు మేము ఇవ్వలేదు’’ అని బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.
అత్యాచారం చేసిన అమ్మాయిని వివాహం చేసుకుంటావా? అని ఓ రేపిస్టును సుప్రీం కోర్టు అడగడం దారుణమని మహిళా సంఘాలు, సామాజిక ప్రముఖులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. ఇలా వ్యాఖ్యల ద్వారా పరోక్షంగా అత్యాచారాన్ని సమర్థించినట్లే భావించాల్సి ఉంటుందని, ఖండిస్తున్నామని, సీజే బోబ్డే వెంటనే రాజీనామా చేయాలని ప్రముఖులు డిమాండ్ చేశారు. ముంబైకి చెందిన మొహిత్ సుభాష్‌ చవాన్‌ అనే ప్రభుత్వోద్యోగి స్కూల్లో చదువుకుంటున్న బాలికను పదేపదే రేప్‌ చేయడమే కాక, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే పెట్రోల్‌ పోసి తగలబెడ్తానని, యాసిడ్‌ పోసి మొహం కాల్చేస్తానని బెదిరించాడు. ఘటన జరిగే నాటికి ఆమె వయస్సు 16 సంవత్సరాలు. దీంతో ఫోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా... బాంబే హైకోర్టు తిరస్కరించింది. దీంతో అతడు సుప్రీంను ఆశ్రయించాడు. ప్రధాన న్యాయమూర్తి బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ విచారణ సందర్భంగా పలు వ్యాఖ్యలు చేసింది. ‘‘మీరు ఆమెను పెళ్లాడతారా? అలాగని ఒత్తిడి తేవడం లేదు.’’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై సర్వత్రా వ్యతిరేకత ఎదురైంది.





Untitled Document
Advertisements