థైరాయిడ్ వల్ల బరువు తగ్గడంలేదా? అయితే ఇది మీకోసమే

     Written by : smtv Desk | Tue, Mar 09, 2021, 11:36 AM

థైరాయిడ్ వల్ల బరువు తగ్గడంలేదా? అయితే ఇది మీకోసమే

మన శరీరం థైరాయిడ్ హార్మోన్లను కావాల్సినంత ఉత్పత్తి చేయనప్పుడు హైపోథైరాయిడిజం అనే వ్యాధి రావడం జరుగుతుంది. ఈ హార్మోన్ మానవ శరీర పెరుగుదల, జీవక్రియలు మరియు అంతర్గత రోగనిరోధకతలో సైతం కీలక పాత్ర పోషిస్తుంది. థైరాయిడ్ సమస్యతో బాధపడుతూ శరీర బరువును తగ్గించుకోవడానికి కష్టపడుతుంటే, మీ జీవక్రియలు సమర్థవంతంగా జరుగుతూ దైనందిన జీవనంలో భాగంగానే బరువు తగ్గడానికి తీసుకోవాల్సిన కొన్ని అత్యుత్తమ ఆహారాలు మరియు సులభమైన మార్గాలను మేము మీకు సవివరంగా అందిస్తున్నాము.
అంతర్లీనంగా థైరాయిడ్ సమస్య ఉన్నవారికి, శరీరంలో జీవక్రియలు జరిగే పనితీరు బలహీనపడుతుంది. మన జీవక్రియ వ్యవస్థ అనేది శరీర పనితీరును ప్రభావితం చేయడంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. అంతేకాక వివిధ జీవక్రియల్లో భాగంగా తీసుకున్న ఆహారంలోని కేలరీలను కరిగించే విధానాన్ని సైతం ప్రభావితం చేస్తుంది. మీ శరీర బరువు పెరుగుతుంది. దేహంలోని అదనపు బరువును తగ్గించుకోవడం మీకు కష్టతరమవుతుంది.
నెమ్మదిగా జరిగే జీవక్రియల కారణంగా రక్తపోటు మరియు కొలెస్ట్రాల్, ఉదరంలో సమస్యలు రావడంతో పాటు అదనపు ఆరోగ్య ప్రమాదాలు కూడా వచ్చే అవకాశముంది. అందువల్ల, ఆరోగ్యకరమైన జీవితం కోసం ఆహారాన్ని సమతుల్యం చేసుకోవడం మరియు థైరాయిడ్ సమస్యలను సరిదిద్దుకోవడం చాలా అవసరం.

మనం తీసుకునే నాణ్యమైన ఆహారం హార్మోన్ల పనితీరును నియంత్రించగలదు మరియు థైరాయిడ్ పరిస్థితిని సమన్వయం చేయడానికి సహాయపడుతుంది, అయితే ఆహారం మాత్రమే హైపోథైరాయిడిజమ్‌ సమస్యను నయం చేయలేదని మనం గమనించాలి. అయినప్పటికీ, సరైన పోషకాహారం, వ్యాయామం మరియు ఔషధాలను క్రమంగా తీసుకోవడం వలన, నిపుణుల సూచన మేరకు సరైన ఆహారాన్ని తినడం వల్ల హైపోథైరాయిడిజం నయం అవుతుంది.
గణాంకాల ప్రకారం, ప్రపంచ జనాభాలో 1/3 వ వంతు అయోడిన్ లోపంతో బాధపడుతున్నారు. అయోడిన్ అనేది శరీరంలో థైరాయిడ్ పనితీరును ఉత్తేజపరిచే ఒక ముఖ్యమైన ఖనిజం. అందువల్ల, హైపోథైరాయిడిజం ఉన్నవారు వారు తీసుకునే ఆహారంలో అయోడిన్‌ కలిగిన పదార్థాలు వాడాలి. ఇది శరీరంలో థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది. అయోడిన్ కలిగిన ఉప్పు, చేపలు, పాల పదార్థాలు, గుడ్లు వంటి ఆహారం తీసుకుంటే థైరాయిడ్ సమస్య నివారణ త్వరితంగా జరుగుతుంది.
థైరాయిడ్ రోగులు ఫైబర్ పదార్థాలు పుష్కలంగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల బరువు క్రమంగా తగ్గుతారు. ఫైబర్ జీర్ణక్రియను నియంత్రించడంలో సహాయపడుతుంది. దేహంలో ఏర్పడ్డ చెడు పదార్థాలను తొలగించడాన్ని ఫైబర్ వేగవంతం చేస్తుంది. రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయలు, పప్పుధాన్యాలు పుష్కలంగా తీసుకుంటే థైరాయిడ్ సమస్య నివారణ జరుగుతుంది.
సెలీనియం శరీరానికి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్‌ను పుష్కలంగా ఉత్పత్తి చేయడంలో సహాయపడే ముఖ్యమైన ఖనిజాలవణం. ఆహారంలో తగినంత సెలీనియం తీసుకుంటే అది దేహంలోని ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో సహాయపడుతుంది. ఫ్రీ రాడికల్స్, బరువు పెరగడానికి దోహదం చేస్తాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం సెలీనియం శరీరంలో రోగనిరోధక వ్యవస్థ పనితీరును కూడా బలపరుస్తుందని సూచించాయి.
చక్కెర మరియు అధిక పిండి పదార్థాలు ఉండే ఆహారం తీసుకుంటే బరువు తగ్గడం అనేది జరగదు. అందువల్ల, థైరాయిడ్‌ను అదుపులో పెట్టుకుని, బరువు తగ్గాలని అనుకుంటే తీసుకునే ఆహారంలో చక్కెర ఉండే పదార్థాలు పరిమితం చేయడం లేదా పిండిపదార్థాలున్న ఆహారాన్ని తీసుకోవడం పూర్తిగా మానేయండి. ఇన్సులిన్ స్థాయిని పెంచనటువంటి ఆహారాన్ని తీసుకోవడానికి అలవాటు పడండి.

రోగ నిరోధకత వ్యవస్థలోని అంతర్గత అవయవాల పనితీరును మెరుగుపర్చే ఆహారం అనేది థైరాయిడ్ రోగులకు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. రోగ నిరోధకత కలిగిన పళ్లు,కాయలు తీసుకోవడం వల్ల అనేక ఇతర ప్రయోజనాలు కూడా పొందవచ్చు.
గాయిట్రోజన్‌లను కలిగి ఉన్న కొన్ని ఆహారాలు థైరాయిడ్ పనితీరుకు ఆటంకం కలిగిస్తాయి మరియు బరువు తగ్గడానికి సైతం అంతరాయం కలిగిస్తాయి.
హైపోథైరాయిడిజం వల్ల సులభంగా బరువు పెరుగుతారు.
క్రింద జాబితాలో ఉన్న ఆహారాన్ని తీసుకోకుండా నియమిత ఆహారం తీనుకుంటే బరువు తగ్గవచ్చు :
-జొన్నలు
-అధికంగా వేయించిన ఆహారాలు
-సొయా నూనెతో చేసే వంటలు
- స్ట్రాబెర్రీ వంటి పండ్లు
-క్రూసిఫరస్ కూరగాయలు వంటివి తినకూడదు.
వీటి బదులుగా, గుడ్లు, మాంసం, చేపలు, కూరగాయలు మరియు విత్తనాలు వంటి కొన్ని ఆహారాలు తీసుకోవాలి. కెఫిన్ లేని పానీయాలు కూడా థైరాయిడ్ రోగులకు ఉపయుక్తమైనవి.










Untitled Document
Advertisements