"మొయిన్ అలీ క్రికెటర్ కాకుంటే...ఉగ్రవాద సంస్థలో చేరేవాడు’’...రచయిత్రి తస్లీమా

     Written by : smtv Desk | Wed, Apr 07, 2021, 12:35 PM


ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీపై బంగ్లాదేశ్ వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకు ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్‌లు జరగనుండగా.. ఏప్రిల్ 10న ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తన ఫస్ట్ మ్యాచ్ ఆడనుంది. ఈ మేరకు ఇప్పటికే చెన్నై క్యాంప్‌నకి చేరుకున్న మొయిన్ అలీ.. ఫస్ట్ మ్యాచ్‌ కోసం సిద్ధమవుతున్నాడు. అయితే.. ఈ ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్‌పై తస్లీమా నస్రీన్ సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి.. సరికొత్త వివాదానికి తెరతీశారు. ‘‘మొయిన్ అలీ ఒకవేళ క్రికెటర్ కాకపోయుంటే.. సిరియాకి వెళ్లి ఐసిస్ ఉగ్రవాద సంస్థలో చేరేవాడు’’ అని తస్లీమా నస్రీన్ ట్వీట్ చేశారు. దాంతో.. చెన్నై సూపర్ కింగ్స్‌ టీమ్‌తో పాటు ఇంగ్లాండ్ క్రికెటర్లు కూడా ఆమెపై విరుచుకుపడ్డారు. ముస్లిం అయినంత మాత్రానా టెర్రరిస్ట్ అవుతారా..? అంటూ ఘాటు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంగ్లాండ్ క్రికెటర్లు జోప్రా ఆర్చర్, శామ్ బిల్లింగ్స్‌తో పాటు ఆ దేశ మాజీ క్రికెటర్లు కూడా మొయిన్ అలీకి మద్దతుగా నిలుస్తూ.. తస్లీమా నస్రీన్‌ని ఉతికారేశారు. దాంతో.. ఆ ట్వీట్‌ని తస్లీమా డిలీట్ చేసింది. ఐపీఎల్ 2021 సీజన్ మినీ వేలంలో రూ.2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన మొయిన్ అలీ కోసం పోటీపడిన చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా రూ.7 కోట్లకి అతడ్ని కొనుగోలు చేసింది. దాంతో.. మొదటిసారి చెన్నైకి ఆడబోతున్న మొయిన్ అలీ మనోభావాల్ని గౌరవిస్తూ.. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ అతను ధరించే జెర్సీపై ఆల్కహాల్ కంపెనీ ఎస్‌ఎన్‌జే 10000 లోగోని తొలగించింది. మొయిన్ అలీ ఆల్కహాల్‌కి సంబంధించిన ప్రచారమే కాదు.. ప్రకటనల్లోనూ నటించడు.






Untitled Document
Advertisements