"బహిరంగ ప్రసంగాలు చేసేటప్పుడు నాయకులు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి"

     Written by : smtv Desk | Wed, Apr 07, 2021, 12:42 PM


బహిరంగ ప్రసంగాలు చేసేటప్పుడు నాగరిక సమాజంలో ఉన్నామనే విషయాన్ని గుర్తుపెట్టుకుని మాట్లాడాలని ఉపరాష్ట్రపతి ముప్పువరపు వెంకయ్య నాయుడు అన్నారు. ముఖ్యంగా ప్రజా ప్రతినిధులు భాషా మర్యాదను పాటించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఆరోగ్యకరమైన, బలమైన ప్రజాస్వామ్య భావనకు ఇది అత్యంత కీలకమన్నారు. ‘ఆజాది కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా గుజరాత్‌లోని చారిత్రక దండి గ్రామంలో ఏర్పాటు చేసిన 25 రోజుల ‘దండి మార్చి’ ఉత్సవాల ముగింపు సభలో వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. ప్రత్యర్థుల పట్ల కూడా ఎల్లప్పుడూ మర్యాదపూర్వకమైన, గౌరవప్రదమైన భాషను ఉపయోగించిన మహాత్మ గాంధీ నుంచి ప్రతి ఒక్కరూ ప్రేరణ పొందాలని సూచించారు.


గాంధీ మహాత్ముడు చెప్పిన అహింసా సిద్ధాంతం శారీరక హింసకు మాత్రమే సంబంధించిన విషయం కాదని.. మాటలు, ఆలోచనలకు కూడా ఈ విషయం వర్తిస్తుందని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ ఉత్సవాలు భారతదేశం కట్టుబడిన సనాతన సిద్ధాంతాల బలాన్ని తిరిగి మన కళ్లకు కడతాయని, ప్రపంచ యవనికపై శక్తివంతమైన దేశంగా భారత్‌ను నిలబెట్టేందుకు మనమంతా కలిసి ముందుకు సాగే దిశగా ప్రేరేపిస్తాయని ఉపరాష్ట్రపతి అన్నారు.

ఈ కార్యక్రమానికి ముందు, అక్కడి ప్రార్థనా మందిరలో మహాత్మా గాంధీకి నివాళులు అర్పించిన ఉపరాష్ట్రపతి.. దండి మార్చి ఉత్సవాల్లో పాల్గొన్న వాలంటీర్లతో సంభాషించారు. 1930 ఏప్రిల్ 4 రాత్రి గాంధీజీ గడిపిన సైఫీ విల్లాను సందర్శించారు. అనంతరం జాతీయ ఉప్పు సత్యాగ్రహ స్మారకాన్ని సందర్శించారు. దేశ చరిత్ర గతిని మార్చిన ఉప్పు సత్యాగ్రహ స్మారకచిహ్నాన్ని సందర్శించడం, నాటి మహనీయుల త్యాగాలను గౌరవించే సందర్భమే కాకుండా, ఉన్నతమైన భావోద్వేగ అనుభవంగా ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.

భారతదేశం స్వాతంత్య్రాన్ని సముపార్జించుకుని 75 సంవత్సరాల మైలురాయిని చేరుకుంటున్న తరుణంలో 75 వారాల పాటు నిర్వహించ తలపెట్టిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను మార్చి 21న సబర్మతి ఆశ్రమం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. 75 ఏళ్లో భారతదేశం సాధించిన ప్రగతిని ప్రతిబింబించే విధంగా ఈ పండుగను నిర్వహించనున్నారు.





Untitled Document
Advertisements