"పోలీసులు మాకు శత్రువులు కాదు"...బందీగా ఉన్న జవాన్ ఫోటో విడుదల

     Written by : smtv Desk | Wed, Apr 07, 2021, 01:38 PM


ఛత్తీస్‌గఢ్ దాడి తర్వాత బందీగా ఉన్న జవాన్‌‌ ఫోటోను మావోయిస్టులు విడుదల చేశారు. కోబ్రా జవాన్ రాకేశ్వర్ సింగ్ తాజా ఫొటోను రిలీజ్ చేసి.. తమ దగ్గరే సురక్షితంగా ఉన్నారని తెలిపారు. బందీగా ఉన్న రాకేశ్వర్ సింగ్‌ను విడిచిపెట్టేందుకు సిద్దంగా ఉన్నామని మంగళవారం మావోయిస్ట్ పార్టీ విడుదల చేసిన లేఖలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం మద్యవర్తుల పేర్లు విషయంలో క్లారిటీ ఇస్తే చర్చలు జరిపి జవాన్‌ను అప్పగిస్తామని చెప్పారు. చర్చలకు సంబంధించి పోలిస్ ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నది ఇంకా క్లారిటీ లేదు. మరోవైపు జగదల్పూర్‌కు చెందిన బస్తరియా బ్యాక్ బెంచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ ప్రారంభమైంది. మంగళవారం విడుదల చేసిన లేఖలో మావోలు కీలక అంశాలను ప్రస్తావించారు. పోలీసులు తమకు శత్రువులు కాదని మావోయిస్టులు ప్రకటించారు. ఎన్‌కౌంటర్‌లో మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నట్లు లేఖలో ప్రకటించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో 23 మంది పోలీసులు మరణించారని, మరో పోలీస్ తమ వద్ద బందీగా ఉన్నాడని తెలిపారు. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారని వెల్లడించారు.మఎన్‌కౌంటర్‌లో 30 మందికి పైగా పోలీసులు గాయపడ్డారని.. వారంతా పారిపోయారని మావోయిస్టులు తమ లేఖలో పేర్కొన్నారు. దాడికి ముందే పోలీసులు జీరగూడెం గ్రామస్థుడు మాడవి సుక్కాలును పట్టుకొని కాల్చి చంపి, ఎప్పటిలాగే కాల్పుల్లో చనిపోయాడని బూటకపు ప్రచారం చేశారని ఆరోపించారు. బీజాపూర్ ఎన్‌కౌంటర్ అనంతరం 14 ఆయుధాలు, 2 వేల తూటాలు, కొంత సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు మావోలు ప్రకటించారు. పీఎల్‌జీఏను నిర్మూలించేందుకు ప్లాన్ చేశారు. పాలకవర్గం తెచ్చిన యుద్ధంలో పోలీసులు బలిపశువులు కావొద్దు. ప్రజలను, వనరులను, ప్రజా సంపదను కాపాడేందుకే ప్రతిదాడి చేయాల్సి వస్తోంది’ అని మావోయిస్టులు తమ లేఖలో ప్రస్తావించారు.


Untitled Document
Advertisements