"నా సినిమాలు నా పిల్లలకు నచ్చవు"...కన్నీరు పెట్టుకున్న శేఖర్ కమ్ముల

     Written by : smtv Desk | Wed, Apr 07, 2021, 07:14 PM


టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్‌గా శేఖర్ కమ్ములకు మంచి పేరు ఉంది. ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్, లీడర్, ఫిదా ఇప్పుడు లవ్ స్టోరీ ఇలా ఏ సినిమా తీసుకున్నా శేఖర్ కమ్ముల మార్క్ కనిపిస్తుంది. రక్తపాతం, హీరోయిజం, కామెడీ, వల్గారిటీ, ఓవర్ ఎక్స్ పోజింగ్ లాంటి కమర్షియల్ ముడిసరుకుని ఉపయోగించుకోకుండా సినిమాని క్లాస్ అండ్ నీట్‌గా తీసి ప్రేక్షకులతో శెభాష్ అనిపించుకోవడం ఈ దర్శకుడి శైలి. తాజాగా నాగచైతన్య, సాయి పల్లవి జంటగా ‘లవ్ స్టోరీ’ అనే బ్యూటిఫుల్ ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు శేఖర్ కమ్ముల. ఆశ నిరాశల జీవితంలో ఈ అందమైన ప్రేమ ఎలా ఉంటుందో చూడాలనే కుతూహలాన్ని ‘లవ్ స్టోరీ’ చిత్రంతో క్రియేట్ చేస్తున్నారు శేఖర్ కమ్ముల. కుటుంబ భావోద్వేగాలు, ప్రేమ, వినోదం అన్ని అంశాల కలబోతగా ఈ లవ్ స్టోరీ రూపొందించారు.

కాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చిన శేఖర్ కమ్ముల.. తన పర్సనల్ విషయాలు, సినీ జర్నీకి సంబంధించిన విషయాలను చెప్పుకుని ఎమోషనల్ అయ్యారు. సరదాగా నవ్వుతూ ఉండే శేఖర్ కమ్ముల కళ్లు చెమ్మగిల్లాయి.

వచ్చిండే.. మెల్ల మెల్లగ వచ్చిండే.. అనే సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చిన శేఖర్ కమ్ముల. ఫిదా సినిమాలో ఈ సాంగ్ నా హైట్ గురించి రాయించుకున్నది కాదని.. వరుణ్ తేజ్ కూడా పొడుగే అంటూ అలీ ప్రశ్నకి సమాధానం ఇచ్చారు. వరుణ్ హైట్ తన హైట్ సమానమే కానీ.. ఆయనలో నేను సగం ఉంటా అని చమత్కరించారు.

ఇక సినిమా స్టార్ట్ అయ్యిందంటే.. ఇంకా ఇంకా వెయిట్ తగ్గిపోతుంటానని.. చాలామంది అడుగుతుంటారు కూడా ఏంది సార్ ఇంత చిక్కిపోతున్నారని.. నాకు తిండిమీద ధ్యాస ఉండదు.. ఎక్కువసార్లు అలా కెలుకుతూ ఉంటా.. అందుకే సన్నంగా ఉంటా అని చెప్పారు శేఖర్ కమ్ముల.

ఆనంద్ Vs శంకర్ దాదా
ఇక సినిమా కష్టాల గురించి చెప్తూ.. ఆనంద్ సినిమా అప్పుడే మెగాస్టార్ శంకర్ దాదా విడుదల కావడంతో కారు డ్రైవర్ కూడా ఆనంద్‌నా ఇదేం సినిమా అని అడిగారని.. కొంతమంది బలవంతంగా ఆనంద్ సినిమా చూపించామని సరదా విషయాలను షేర్ చేసుకున్నారు.

పెద్ద హీరోలతో సినిమా చేయలేక కాదు.. నా మైనస్ అదే
ఇక పెద్ద హీరోలతో సినిమాలు చేయకపోవడం వెనుక కారణాల్ని తెలియజేశారు శేఖర్ కమ్ముల. ‘పెద్ద హీరోలతో వద్దని కానీ.. రిస్క్ అని కానీ అనుకోను. పలానా హీరోకి స్క్రిప్ట్ కుదురుతుంది అంటే.. చాలా సిన్సియర్‌గా వెళ్లి చెప్తాను. అలాంటి రోజులు చాలా ఉన్నాయి. నేను చెప్పిన రోజులు ఉన్నాయి.. వాళ్లకి కథ నచ్చకపోతే లేదని చెప్పినవీ ఉన్నాయి. నేను కథని చాలా వీక్‌గా నెరేట్ చేస్తా.. నేను స్టోరీ చెప్తుంటే వినేవాళ్లకి ఆవలింతలు వస్తాయి.

ఫిదా సినిమా మహేష్ బాబు,రామ్ చరణ్‌కి చెప్పా.. కానీ
నా కథల్ని పెద్ద హీరోలు రిజెక్ట్ చేశారు.. ఫిదా సినిమా మహేష్ బాబుకి చెప్పా.. రామ్ చరణ్‌కి చెప్పా.. కానీ సెట్ కాలేదు. నేను హిట్ అవుతుందని అనుకున్న తరువాత తేడా కొట్టిన సినిమా అంటూ ఏదీ లేదు. సినిమా హిట్టా ఫట్టా అని బల్లగుద్ది చెప్పేస్తా.. హ్యాపీడేస్ ట్రెండ్ సెట్టర్ అనిచెప్పా.. పాలిటిక్స్ సినిమాల్లో లీడర్ నిలబడుతుందని చెప్పా.. లైవ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా హిట్ అని నేను బల్లగుద్ది చెప్పలేదు. అప్పుడు బల్ల ఉంది కానీ గుద్దలేదు (నవ్వుతూ).

నా సినిమాలు నా పిల్లలకు నచ్చవు
నాకు ఇద్దరు పిల్లలు.. నా సినిమాలు చూసి కామెంట్స్ చేస్తారు. నిజానికి వాళ్లకి నా సినిమాలు నచ్చవు. వాళ్లకి అనీల్, బ్రహ్మానందం లాంటి వాళ్లు కావాలి. కామెడీ అంటే నాకు ఇష్టం లేకపోవడం కాదు కానీ.. నా భార్య కూడా అంటుంది. బ్రహ్మానందం ఉంటే బాగుంటుంది కదా మీ సినిమాల్లో అంటుంది.



సారంగదరియా సాంగ్ విని.. కళ్లలో కన్నీళ్లు
ఈ సాంగ్ లిరిక్స్ ఎంత వినసొంపుగా రాశారో సుద్దాల అశోక్ తేజ. కానీ ఈ సాంగ్ వివాదం కావడంతో ఆయన చాలా బాధపడ్డారు.. ఆయన బాధపడినందుకు నేను కూడా బాధపడుతున్నా.. అంటూ ఎమోషనల్ అయ్యారు శేఖర్ కమ్ముల. మరి ఆ తరువాత అలీ ఏం చూపించారో ఏమైందో తెలియదు కానీ.. శేఖర్ కమ్ముల భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.







Untitled Document
Advertisements