రియాన్ పరాగ్ ఔట్‌...ఒంటరైన సంజు శాంసన్

     Written by : smtv Desk | Tue, Apr 13, 2021, 11:13 AM

రియాన్ పరాగ్ ఔట్‌...ఒంటరైన సంజు శాంసన్

ఐపీఎల్ 2021 సీజన్‌లో భారీ స్కోర్లతో అభిమానులకి అసలైన టీ20 మజాని పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు సోమవారం రాత్రి అందించాయి. ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో 222 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన రాజస్థాన్.. అసాధారణరీతిలో పోరాడినా చివరికి 217/7కి పరిమితమైంది. ఛేదనలో వీరోచిత శతకం బాదిన రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ (119: 63 బంతుల్లో 12x4, 7x6).. టీమ్ విజయానికి చివరి బంతికి 5 పరుగులు అవసరమైన దశలో సిక్స్ కొట్టబోయి బౌండరీ లైన్‌కి సమీపంలో ఫీల్డర్ దీపక్ హుడాకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దాంతో.. 4 పరుగుల తేడాతో పంజాబ్ విజయం సాధించింది.

వాస్తవానికి మ్యాచ్‌లో కీలక మలుపు ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో పంజాబ్‌కి లభించింది. రాజస్థాన్ విజయానికి చివరి 30 బంతుల్లో 68 పరుగులు అవసరమైన దశలో సంజు శాంసన్‌తో కలిసి విధ్వంసకరీతిలో ఆడిన 19 ఏళ్ల యువ హిట్టర్ రియాన్ పరాగ్ (25: 11 బంతుల్లో 1x4, 3x6).. వరుస సిక్సర్లు బాదేశాడు. ఇన్నింగ్స్ 16వ ఓవర్ వేసిన మురగన్ అశ్విన్ బౌలింగ్‌లో పరాగ్ బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లు కొట్టాడు. ఇదే ఓవర్‌లో సంజు శాంసన్ కూడా ఒక సిక్స్ బాదడంతో ఏకంగా 20 పరుగుల్ని రాజస్థాన్ పిండుకుంది. దాంతో.. సమీకరణం 24 బంతుల్లో 48 పరుగులుగా మారిపోయింది. ఈ దశలో ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చిన మహ్మద్ షమీ.. రెండో బంతికే పరాగ్‌ని ఔట్ చేసేశాడు. దాంతో.. అప్పటికే 19 బంతుల్లో 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడి విడిపోయింది. ఇక అక్కడి నుంచి సంజు శాంసన్ ఛేదనలో ఒంటరివాడయ్యాడు. ఆ ఓవర్‌లో రాజస్థాన్‌కి 8 పరుగులు మాత్రమే వచ్చాయి.

చివర్లో బంతులు, పరుగుల మధ్య అంతరం పెరుగుతున్నా.. రాహుల్ తెవాటియా (2: 4 బంతుల్లో), క్రిస్ మోరీస్ (2 నాటౌట్: 4 బంతుల్లో) కనీసం ఒక్క పెద్ద షాట్ కూడా ఆడలేకపోయారు. దాంతో.. సంజు శాంన్ ఎక్కువగా తానే స్ట్రైక్ తీసుకోవాల్సి వచ్చింది. ఒకవేళ రియాన్ పరాగ్ మరో రెండు ఓవర్ల పాటు సంజు శాంసన్‌కి జోడీగా క్రీజులో ఉండింటే..? ఛేదన మరోలా ఉండేది.





Untitled Document
Advertisements