నాకు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు ... భావోద్వేగానికి గురైన కెప్టెన్ సంజూ శాంసన్

     Written by : smtv Desk | Tue, Apr 13, 2021, 12:13 PM

ఐపీఎల్ లో భాగంగా ముంబై వేదికగా నిన్న జరిగిన ఉత్కంఠ భరిత పోరులో చివరి బంతికి పంజాబ్ కింగ్స్ జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే. చివర్లో గెలిచిన పంజాబ్ జట్టు ఉపశమనాన్ని పొందినా, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్, మ్యాచ్ ని దాదాపు తమవైపు లాగేసుకున్నంత పని చేశాడు. అద్భుత రీతిలో ఆడుతూ, సెంచరీ సాధించడంతో, ఆ జట్టు విజయానికి ఒక్కమెట్టు దూరం వరకూ వెళ్లింది.

ఇక ఈ మ్యాచ్ ఓటమి అనంతరం మాట్లాడిన సంజూ శాంసన్, భావోద్వేగానికి గురయ్యాడు. తనకు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదన్నాడు. తాము టార్గెట్ కు చాలా దగ్గరగా వెళ్లామని, కానీ దురదృష్టం కొద్దీ ఓడిపోయామని అన్నాడు. ఇంతకన్నా తాను ఇంకేం చేయగలనని ప్రశ్నించాడు. గేమ్ లో గెలుపు, ఓటములు సహజమని అన్నాడు.

ఈ మ్యాచ్ లో వాడిన పిచ్, సమయం గడిచే కొద్దీ బ్యాటింగ్ కు అనుకూలంగా మారుతుందని, తాము సులువుగానే టార్గెట్ ను చేరుకోగలమని అనుకున్నామని, కానీ చివర్లో చేజారిందనీ చెప్పాడు. అయితే చివరకు ఓడిపోవడం అసంతృప్తిని కలిగించినా, తాము బాగా ఆడామన్న తృప్తి మిగిలిందని అన్నాడు. ఈ మ్యాచ్ లో తాను బ్యాటింగ్ ను ఆస్వాదించానని చెప్పుకొచ్చిన సంజూ శాంసన్, ముఖ్యంగా మ్యాచ్ ద్వితీయార్థం అద్భుతమని అన్నాడు. కాగా, ఈ మ్యాచ్ లో శాంసన్ 63 బంతుల్లోనే 119 పరుగులు చేసినా, రాజస్థాన్ రాయల్స్ జట్టు 4 పరుగుల తేడాతో ఓడిపోయింది.





Untitled Document
Advertisements