మహారాష్ట్ర : రాత్రి సమయంలో లాక్‌డౌన్‌ తరహా ఆంక్షలు

     Written by : smtv Desk | Wed, Apr 14, 2021, 10:54 AM

మహారాష్ట్ర : రాత్రి సమయంలో లాక్‌డౌన్‌ తరహా ఆంక్షలు

మహారాష్ట్రలో కరోనా పంజా విసురుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కేసులు భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి. తాజా పరిణామాలతో లాక్‌డౌన్ తప్పదనే ఊహాగానాలు వినిపించాయి. దీంతో సీఎం థాక్రే క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించడం లేదన్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ వైరస్ తీవ్రత పెరుగుతుండటంతో బుధవారం రాత్రి 8 గంటల నుంచి లాక్‌డౌన్‌ తరహా ఆంక్షలుంటాయని.. రాష్ట్రవ్యాప్తంగా 15రోజుల పాటు 144 సెక్షన్‌ విధిస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలు సహకరించాలని కోరారు.

ఈ ఆంక్షల సమయంలో అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఉంటుందన్నారు సీఎం. అత్యవసరమైతేనే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలని.. అవసరం లేకుండా ప్రయాణాలు చేయొద్దు.. అత్యవసర సేవలకే లోకల్‌ బస్సులు, రైళ్లు వినియోగించాలని సూచించారు. పెట్రోలు బంకులు, బ్యాంకింగ్‌ సంస్థలు పనిచేస్తాయని.. హోటళ్లు, రెస్టారెంట్లలో పార్సిళ్లకు మాత్రమే అనుమతిస్తామన్నారు. బుధవారం ఉదయం 7 గంటల నుంచి విద్యాలయాలు, ప్రార్థనా మందిరాలు, సినిమా థియేటర్లు, పార్కులు, జిమ్‌లు మూసివేస్తున్నామన్నారు. మే 1 వరకు దుకాణాలు, వాణిజ్య సంస్థలు పని చేయవని చెప్పారు.

పేదలకు 3కిలోల గోధుమలు, 2కిలోల బియ్యం పంపిణీ చేస్తాం. ఆటో డ్రైవర్లు, వీధివ్యాపారులకు రూ.1,500 ఆర్థికసాయం అందిస్తామన్నారు ఉద్ధవ్. మహారాష్ట్రలో కొవిడ్‌ వ్యాప్తి తీవ్రంగా ఉందని.. ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్‌ కొరత ఉందన్నారు. రెమిడెసివిర్‌‌కు డిమాండ్‌ పెరుగుతోందని.. రాష్ట్రంలో వైద్య సౌకర్యాలు క్రమంగా పెంచుతున్నామన్నారు. ఆక్సిజన్‌ సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరారు.. మొత్తం ఆక్సిజన్‌ ఉత్పత్తిని వైద్య అవసరాలకే వాడాలన్నారు.





Untitled Document
Advertisements