ముంబయిపై గెలిచి ఉత్సాహంగా RCB....రికార్డుల్లో SRH టాప్

     Written by : smtv Desk | Wed, Apr 14, 2021, 12:56 PM

ముంబయిపై గెలిచి ఉత్సాహంగా RCB....రికార్డుల్లో SRH టాప్

ఐపీఎల్ 2021 సీజన్‌లో తన జర్నీని ఓటమితో ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. బుధవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడబోతోంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం ఈ మ్యాచ్‌కి ఆతిథ్యం ఇవ్వబోతుండగా.. ఇక్కడే తన తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 10 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. మరోవైపు తన ఫస్ట్ మ్యాచ్‌లోనే ముంబయి ఇండియన్స్‌పై 2 వికెట్ల తేడాతో గెలిచిన బెంగళూరు టీమ్ మంచి ఉత్సాహంలో కనిపిస్తోంది.

రికార్డుల పరంగా చూసుకుంటే బెంగళూరుపై హైదరాబాద్‌ పైచేయిలా కనిపిస్తోంది. ఈ రెండు జట్లు ఇప్పటి వరకూ 18 మ్యాచ్‌ల్లో తలపడగా.. హైదరాబాద్ టీమ్ 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇక మిగిలిన 8 మ్యాచ్‌లకిగానూ ఏడింట్లో బెంగళూరు జట్టు గెలుపొందగా.. ఒక మ్యాచ్‌లో మాత్రం ఫలితం తేలలేదు. ఈ రెండు జట్లు తలపడిన ప్రతిసారి పోరు చాలా ఆసక్తికంగా జరుగుతున్నట్లు రికార్డులు చెప్తున్నాయి. ఐపీఎల్‌లో బెంగళూరుపై ఇప్పటి వరకూ హైదరాబాద్ చేసిన అత్యధిక స్కోరు 231 పరుగులుకాగా.. హైదరాబాద్‌పై బెంగళూరు చేసిన అత్యధిక స్కోరు 227 పరుగులు.

ఐపీఎల్ 2020 సీజన్‌లో బెంగళూరు, హైదరాబాద్ జట్లు మూడు సార్లు తలపడ్డాయి. ఇందులో రెండు లీగ్ దశ మ్యాచ్‌లు.. ఒక ప్లేఆఫ్ మ్యాచ్ ఉంది. ఫస్ట్ మ్యాచ్‌లో బెంగళూరు విజయం సాధించగా.. ఆ తర్వాత మరో లీగ్ మ్యాచ్‌లో గెలిచిన హైదరాబాద్ ప్రతీకారం తీర్చుకుంది. ఆ తర్వాత ప్లేఆఫ్‌లో భాగంగా జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లోనూ బెంగళూరుపై 6 వికెట్ల తేడాతో హైదరాబాద్ అలవోక విజయాన్ని అందుకుంది. ఐపీఎల్ 2016 సీజన్‌ ఫైనల్లోనూ బెంగళూరుపై విజయం సాధించిన హైదరాబాద్.. టైటిల్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.

బెంగళూరు జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ, పవర్ హిట్టర్లు గ్లెన్ మాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్ మంచి టచ్‌లో ఉన్నట్లు కనిపిస్తున్నారు. కానీ.. ప్రయోగాత్మక ఓపెనర్ వాషింగ్టన్ సుందర్, మూడో స్థానంలో ఆడిన పాటిదార్ అంచనాల్ని అందుకోలేకపోయారు. అలానే డేనియల్ క్రిస్టియన్ కూడా ఆల్‌రౌండర్‌గా విఫలమయ్యాడు. దాంతో.. ఆ జట్టు లోయర్ మిడిలార్డర్ బలహీనంగా కనిపిస్తోంది. బౌలింగ్‌లోనూ చాహల్ మొదటి మ్యాచ్‌లోనే 4 ఓవర్లలో 41 పరుగులిచ్చేశాడు. సిరాజ్ పొదుపుగా బౌలింగ్ చేసినప్పటికీ వికెట్ దక్కించుకోలేకపోయాడు. అయితే.. పొడవాటి బౌలర్ జెమీషన్ మాత్రం పొదుపుగా బౌలింగ్ చేసి వికెట్ కూడా తీస్తుండటం ఒకటే ఆ జట్టుకి బౌలింగ్ పరంగా ఉపశమనం. ఫీల్డింగ్‌లోనూ ఆ జట్టు మొదటి మ్యాచ్‌లో కొన్ని తప్పిదాలకి పాల్పడింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టుకి తొలి మ్యాచ్‌లో మెరుగైన ఆరంభం లభించలేదు. సాహా, డేవిడ్ వార్నర్.. సింగిల్ డిజిట్‌కే ఔటవగా.. మనీశ్ పాండే హాఫ్ సెంచరీ నమోదు చేసినా మ్యాచ్ గమనానికి అనుగుణంగా గేర్ మార్చలేకపోయాడు. దాంతో.. మిడిలార్డర్‌లో జానీ బెయిర్‌స్టోపై అదనపు భారం పడుతోంది. విజయ్ శంకర్, మహ్మద్ నబీ నిలకడలేమితో ఇబ్బందిపడుతుండగా.. యువ హిట్టర్ అబ్దుల్ సమద్ అలవోకగా సిక్సర్లు బాదుతుండటం ఆ జట్టుకి కొత్త ఆశ రేపుతోంది. బౌలింగ్‌లో మాత్రం రషీద్ ఖాన్, మహ్మద్ నబీ చెపాక్ పిచ్‌పై ఆకట్టుకుంటున్నారు. కానీ.. భువీ, సందీప్ శర్మ ధారాళంగా పరుగులిచ్చేస్తున్నారు. నటరాజన్ కూడా ఆరంభంలో పరుగులిస్తున్నా.. స్లాగ్ ఓవర్లలో కట్టడి చేస్తున్నాడు. మొత్తంగా బెంగళూరుతో పోలిస్తే.. హైదరాబాద్ బౌలింగ్ విభాగం బలంగా కనిపిస్తోంది.





Untitled Document
Advertisements