ఏడేళ్ల తర్వాత మళ్లీ బౌలింగ్...బెడిసి కొట్టింది

     Written by : smtv Desk | Wed, Apr 14, 2021, 02:44 PM

ఏడేళ్ల తర్వాత మళ్లీ బౌలింగ్...బెడిసి కొట్టింది

ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ బౌలింగ్ చేశాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఒక ఓవర్ బౌలింగ్ చేసిన రోహిత్ శర్మ 9 పరుగులు ఇచ్చాడు. కానీ.. చాలా ఏళ్ల తర్వాత ఐపీఎల్‌లో మళ్లీ బౌలింగ్ చేసిన రోహిత్ శర్మ.. మొదటి బంతికే గాయపడ్డాడు. అయితే.. గాయం తీవ్రత తక్కువగా ఉండటంతో ముంబయి ఊపిరి పీల్చుకుంది. దాంతో.. నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు.

మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబయి టీమ్ 152 పరుగులు చేయగా.. ఛేదనలో కోల్‌కతా నైట్‌రైడర్స్ 13 ఓవర్లు ముగిసే సమయానికి 104/3తో మెరుగైన స్థితిలో కనిపించింది. ఈ దశలో 14వ ఓవర్‌లో రోహిత్ శర్మ స్వయంగా బౌలింగ్‌కి వచ్చాడు. చెపాక్ పిచ్ స్పిన్‌కి అనుకూలిస్తున్నట్లు కనిపించడంతో.. ఆఫ్ బ్రేక్ వేసేందుకు రోహిత్ శర్మ సిద్ధమయ్యాడు. కానీ.. ఆ ఓవర్ మొదటి బంతిని వేసే క్రమంలో అతని కాలు బెణికింది. దాంతో.. బౌలింగ్‌ని నిలిపివేసిన రోహిత్ శర్మ మైదానంలోనే కూర్చుండిపోయాడు. వెంటనే గ్రౌండ్‌లోకి వచ్చిన ఫిజియో సాయం తీసుకుని.. ఆ తర్వాత ఆ ఓవర్‌ని రోహిత్ శర్మ కొనసాగించాడు.

ఆ ఓవర్‌లో రోహిత్ శర్మ వేసిన మొదటి బంతికే దాదాపు షకీబ్ అల్ హసన్‌ని బోల్డ్ చేసేలా కనిపించాడు. కానీ.. ఆఖరి క్షణంలో బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి బౌండరీకి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఐదు బంతుల్నీ నితీశ్ రాణా, షకీబ్ అల్ హసన్ జాగ్రత్తగా ఆడుతూ కేవలం సింగిల్స్‌తో సరిపెట్టారు. ఐపీఎల్‌లో రోహిత్ శర్మ చివరిగా 2014, మే 7న బౌలింగ్ చేశాడు.







Untitled Document
Advertisements