జగదీశ్ రెడ్డి, కిషన్ రెడ్డి,నోముల భగత్ కుమార్, రేవంత్ రెడ్డి‌ల పై కేసులు నమోదు

     Written by : smtv Desk | Wed, Apr 14, 2021, 03:09 PM

జగదీశ్ రెడ్డి, కిషన్ రెడ్డి,నోముల భగత్ కుమార్, రేవంత్ రెడ్డి‌ల పై కేసులు నమోదు

కరోనా కేసులు పెరుగుతున్న వేళ నల్గొండ పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వం విధించిన కొవిడ్ నిబంధనలను ఎవరు బ్రేక్ చేసినా కేసులు తప్పవని నల్గొండ డీఐజీ రంగనాథ్ బుధవారం హెచ్చరించారు. సీఎం సభకు కోవిడ్ నిబంధనల ప్రకారం ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ సభను అడ్డుకోవడానికి ఎవరైనా ప్రయత్నిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సాగర్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నింటికీ కరోనా నిబంధనలు వర్తిస్తాయని.. 17వ తేదీన ఎన్నికలు ముగిసేవరకు అధికారులను, ఉద్యోగులను ఎవరూ ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. ఒకవేళ ఎవరైనా ఇబ్బంది పెడితే చర్యలు తప్పవని అన్నారు. ఎవరైనా రెచ్చగొట్టినా కార్యకర్తలు రెచ్చిపోవద్దని సూచించారు.

‘‘ఘర్షణల్లో పాల్గొనే కార్యకర్తలకు ఆ తర్వాత ఇబ్బందులు ఉంటాయి. అలాంటివారిపై కేసులు తప్పవు. ఇప్పటివరకు కరోనా నిబంధనలు బ్రేక్ చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, టీఆర్ఎస్ సాగర్ అభ్యర్థి నోముల భగత్ కుమార్‌తో పాటు మరికొంత మందిపై కేసులు నమోదు చేశాం. అదేవిధంగా నెంబర్ ప్లేట్లు లేని వాహనాలపై కూడా కేసులు నమోదుచేస్తున్నాం’’ అని డీఐజీ రంగనాథ్ తెలిపారు.

మరోవైపు, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ.. నల్గొండ జిల్లాలో కరోనా విజృంభిస్తుందని.. దాంతో ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. సీఎం సభకు వచ్చేవారు తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కు పెట్టుకోవాలని నిర్దేశించారు. జిల్లా వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరూ టెస్టులు చేయించుకోవాలని ఆయన అన్నారు.





Untitled Document
Advertisements