చివరి వరకూ క్రీజులో ఉన్నా రసెల్, కార్తీక్ ఫెయిల్

     Written by : smtv Desk | Wed, Apr 14, 2021, 04:47 PM

చివరి వరకూ క్రీజులో ఉన్నా రసెల్, కార్తీక్ ఫెయిల్

ఐపీఎల్ 2021 సీజన్‌లో హిట్టర్లతో నిండిన జట్లలో కోల్‌కతా నైట్‌రైడర్స్ కూడా ఒకటి. గతంలో టీమ్ విజయానికి 18 బంతుల్లో 53 పరుగులు అవసరమైన దశలోనూ ఓ నాలుగు బంతులు మిగిల్చి మరీ ఆ జట్టు విజయం సాధించిన సందర్భం ఉంది. కానీ.. ముంబయి ఇండియన్స్‌తో మంగళవారం రాత్రి చెపాక్‌లో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా విజయానికి 18 బంతుల్లో 22 పరుగులు అవసరమవగా.. ఆ జట్టు వరుసగా మూడు ఓవర్లలో 3, 4, 4 పరుగులు మాత్రమే రాబట్టగలిగింది. అదీ.. చేతిలో ఐదు వికెట్లు.. క్రీజులో పవర్ హిట్టర్ ఆండ్రీ రసెల్, దినేశ్ కార్తీక్ ఉన్నా ఆ జట్టు 10 పరుగుల తేడాతో ఓడిపోవడం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో స్పిన్నర్ కృనాల్ పాండ్యా బౌలింగ్‌కిరాగా.. ఆండ్రీ రసెల్, దినేశ్ కార్తీక్ అతి జాగ్రత్తగా బ్యాటింగ్ చేశారు. ఆ ఓవర్‌లో కేవలం మూడు సింగిల్స్ మాత్రమే రాబట్టిన ఈ జోడి.. కనీసం ఒక్క పెద్ద షాట్ కూడా ఆడే ప్రయత్నం చేయలేదు. దాంతో.. సమీకరణం 12 బంతుల్లో 19 పరుగులుగా మారిపోయింది. ఈ దశలో జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌కిరాగా.. రసెల్, కార్తీక్ ఈసారి గేర్ మార్చేందుకు ట్రై చేశారు. కానీ.. బుమ్రా వారికి అవకాశం ఇవ్వలేదు. స్లో డెలివరీలని హిట్ చేసేందుకు ఈ జోడీ ముప్పుతిప్పలు పడింది. దాంతో.. ఆ ఓవర్‌లో 4 పరుగులు మాత్రమేరాగా.. సమీకరణం కాస్తా.. 6 బంతుల్లో 15 పరుగులుగా మారిపోయింది. ముంబయి స్లో బాల్స్‌తో టార్గెట్ చేస్తోందని తెలిసినా.. రసెల్, కార్తీక్ తమ గేమ్ ప్లాన్ మార్చలేదు.

ఆఖరి ఓవర్‌లో ట్రెంట్ బౌల్ట్ అద్భుతమే చేశాడు. ఆండ్రీ రసెల్‌కి ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా స్లో డెలివరీలను విసురుతూ ఇబ్బందిపెట్టాడు. మరోవైపు దినేశ్ కార్తీక్ కూడా రివర్స్ స్వీప్‌తో ఎలాగైనా పరుగులు రాబట్టాలని చూశాడు. కానీ.. ముంబయి స్లో బాల్ వ్యూహం పూర్తిగా అతనికి అర్థమైనట్లు లేదు. ఈ క్రమంలో మూడో బంతిని యార్కర్ లెంగ్త్ రూపంలో బౌల్ట్ సంధించగా.. రసెల్ ప్లిక్ చేయబోయి అతనికే నేరుగా క్యాచ్ ఇచ్చేశాడు. అప్పటికి సమీకరణం 3 బంతుల్లో 13 పరుగులుకాగా.. నాలుగో బంతికి పాట్ కమిన్స్‌ని బౌల్ట్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత రెండు బంతులకీ రెండు పరుగులే రావడంతో.. కోల్‌కతాకి ఓటమి తప్పలేదు. మొత్తంగా కోల్‌కతా నైట్‌రైడర్స్ 31 బంతుల్లో 30 పరుగులు చేయాల్సిన దశలో చేతిలో 6 వికెట్లు ఉన్నప్పటికీ.. చివరికి 10 పరుగుల తేడాతో ఓడిపోవడం గమనార్హం. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే..? ఆండ్రీ రసెల్ తాను ఎదుర్కొన్న చివరి ఏడు బంతుల్లో 7 పరుగులు మాత్రమే తీశాడు.





Untitled Document
Advertisements