సెకండ్ మ్యాచ్‌ గెలిచిన 5 సీజన్లలోనూ టైటిల్ సొంతం....ఈ సారి కూడా?

     Written by : smtv Desk | Wed, Apr 14, 2021, 05:45 PM

సెకండ్ మ్యాచ్‌ గెలిచిన 5 సీజన్లలోనూ టైటిల్ సొంతం....ఈ సారి కూడా?

ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ గత కొన్నేళ్లుగా ఓ సెంటిమెంట్‌ని ఫాలో అవుతోంది. 2008 నుంచి ఐపీఎల్ జరుగుతుండగా.. 2013 నుంచి టోర్నీలో తాను ఆడిన ఫస్ట్ మ్యాచ్‌లోనే ముంబయి ఇండియన్స్ ఓడిపోతూ వస్తోంది. అలానే ఫస్ట్ మ్యాచ్‌లో ఓడి.. రెండో మ్యాచ్‌లో గెలిచిన ప్రతి సీజన్‌లోనూ ఆ జట్టు టైటిల్ విజేతగా నిలుస్తోంది. దాంతో.. ఐపీఎల్ 2021 సీజన్‌లోనూ ముంబయి టోర్నీ విజేతగా నిలవబోతోందంటూ ఆ టీమ్ అభిమానులు సోషల్ మీడియాలో జోస్యం చెప్తున్నారు.

ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో గత శుక్రవారం జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో ఆ జట్టు చేతిలో ముంబయి టీమ్ ఓడిపోయింది. ఆ తర్వాత చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ముంబయి 10 పరుగుల తేడాతో గెలిచి.. టోర్నీలో బోణి కొట్టింది. 2019, 2020లోనూ ఇదే తరహాలో ఫస్ట్ మ్యాచ్‌లో ఓడి.. రెండో మ్యాచ్‌లో గెలిచిన ముంబయి టీమ్ టోర్నీ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. 2019లో చెన్నై చేతిలో ఫస్ట్ మ్యాచ్‌లో ఓడిన ముంబయి.. రెండో మ్యాచ్‌లో కోల్‌కతాపై గెలిచింది. 2020లో ఫస్ట్ మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో ఓడిన ముంబయి.. రెండో మ్యాచ్‌లో బెంగళూరుపై గెలిచింది.

ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ 13 సీజన్లు ముగియగా.. ముంబయి ఇండియన్స్ వరుసగా 2013, 2015, 2017, 2019, 2020లో టైటిల్ విజేతగా నిలిచింది. ఈ ఐదు సార్లు రోహిత్ శర్మ కెప్టెన్సీలోనే ఆ జట్టు టోర్నీ విజేతగా నిలవడం విశేషం.





Untitled Document
Advertisements