"ప్రిన్స్ హ్యారీ పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు" ...హైకోర్టులో పిటిషన్ వేసిన పంజాబ్ మహిళ

     Written by : smtv Desk | Wed, Apr 14, 2021, 05:50 PM


పంజాబ్ అండ్ హరియాణా హైకోర్టులో మంగళవారం (ఏప్రిల్ 13) దాఖలైన పిటిషన్‌ దేశ వ్యాప్తంగా నవ్వులపాలైంది. దీని గురించి ప్రముఖ వార్తా సంస్థలు ట్వీట్లు చేయగా.. ట్విటర్‌లో ఈ వార్త నెటిజన్ల నవ్వులపాలవుతోంది. యూకే మాజీ రాజ కుటుంబీకుడు ప్రిన్స్ హ్యారీని అరెస్ట్ చేయాలంటూ ఓ మహిళ కోర్టు తలుపు తట్టడమే ఇందుకు కారణం. అయితే, ఈ పిటిషన్‌పై హైకోర్టు ధర్మాసనం కూడా ఘాటుగానే స్పందించింది. పూర్తి వివరాలివీ..

ప్రిన్స్ హ్యారీపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని, ఆయనపై అరెస్టు వారెంటు జారీ చేయాలని కోరుతూ ఓ మహిళ పంజాబ్ అండ్ హరియాణా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రిన్స్ హ్యారీ తనను వివాహం చేసుకుంటానని మాట ఇచ్చి తప్పాడని, కాబట్టి అతడిపై అరెస్ట్ వారెంట్ జారీ చేయాలంటూ పిటిషన్‌లో పేర్కొంది. పల్విందర్ సింగ్ అనే అడ్వకేట్ ఈ పిటిషన్‌ను దాఖలు చేసి స్వయంగా విచారణకు హాజరయ్యారు. ఇది న్యాయమూర్తి జస్టిస్ అర్వింద్ సింగ్ సంగ్వాన్ బెంచ్‌కు విచారణకు రాగా.. జడ్జి మాట్లాడుతూ పిటిషన్ చాలా పేలవంగా ఉందని, పిటిషనర్‌ను పెళ్లాడతానంటూ ప్రిన్స్ హ్యారీ పంపినట్టుగా కొన్ని ఈ-మెయిల్స్‌ను పేర్కొన్నారని అన్నారు. దీనిని విచారించేందుకు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేశారు.

అంతేకాదు, ఆ పిటిషన్ కొట్టివేత సందర్భంగా ‘పగటి కలలు కనడం మానేయాలని’ అభివర్ణించింది. అయితే, ఈ నకిలీ సంభాషణను నిజమైనదిగా నమ్ముతున్న పిటిషనర్‌పై సానుభూతిని మాత్రమే చూపించగలమని కోర్టు పేర్కొంది. సోషల్ మీడియా వెబ్‌సైట్ల నుంచి తప్పుడు ఐడీలు సృష్టించి చాటింగ్‌లు చేయడం మామూలేనని, అలాగే ప్రిన్స్‌హ్యారీగా ఐడీతో నకిలీ వ్యక్తి పంజాబ్‌లోని ఏదో చిన్న గ్రామంలోని సైబర్ కేఫ్‌లో కూర్చుని పిటిషనర్‌కు పెళ్లి ప్రతిపాదన చేసి ఉండొచ్చని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం కాలిఫోర్నియాలోని తన కొత్త నివాస సౌధంలో భార్యబిడ్డలతో కలిసి ఉంటున్న ప్రిన్స్ హ్యారీ యూకేకు వెళ్లనున్నారు. కొద్ది రోజుల క్రితమే తన తాత ప్రిన్స్ ఫిలిప్ మరణించిన సంగతి తెలిసిందే. ఆయన చివరి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన వెళ్లనున్నట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు రాశాయి.





Untitled Document
Advertisements