ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు...మ్యాచ్ మొత్తం టర్న్

     Written by : smtv Desk | Thu, Apr 15, 2021, 11:59 AM

ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు...మ్యాచ్ మొత్తం టర్న్

ఐపీఎల్ 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ మిడిలార్డర్ చేతులెత్తేయడంతో పరాజయం పాలైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 150 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన హైదరాబాద్.. చివర్లో వరుసగా వికెట్లు చేజార్చుకుని 143/9కే పరిమితమైంది. ఒకానొక దశలో హైదరాబాద్ విజయానికి 24 బంతుల్లో 35 పరుగులు చేయాల్సిరాగా.. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. దాంతో.. హైదరాబాద్ అలవోక విజయాన్ని అందుకుంటుందని అంతా ఊహించారు. కానీ.. ఒకే ఒక ఓవర్‌లో మ్యాచ్ పూర్తిగా బెంగళూరు చేతుల్లోకి వెళ్లిపోయింది. ఎంతలా హైదరాబాద్ తడబడిందంటే..? కేవలం 29 పరుగుల వ్యవధిలోనే ఏకంగా 7 వికెట్లని హైదరాబాద్ చేజార్చుకుంది. గత ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఇదే తరహాలో ఛేదన చివర్లో హైదరాబాద్ తడబడి 10 పరుగుల తేడాతో ఓడిపోవడం గమనార్హం.

బుధవారం రాత్రి 150 పరుగుల ఛేదనలో హైదరాబాద్ 16 ఓవర్లు ముగిసే సమయానికి 115/2 నిలవగా.. క్రీజులో అప్పటికే సెటిలైన మనీశ్ పాండే, జానీ బెయిర్‌స్టో ఉన్నారు. ఇద్దరూ కుడి చేతి వాటం బ్యాట్స్‌మెన్‌లు కావడంతో.. బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ చాలా తెలివిగా ఎడమచేతి వాటం స్పిన్నర్ షబాజ్ అహ్మద్‌ని రంగంలోకి దింపాడు. అప్పటికి కేవలం ఒక ఓవర్ మాత్రమే వేసిన షబాబ్.. 6 పరుగులు ఇచ్చాడు. దాంతో.. ఈ ఓవర్‌ని టార్గెట్ చేసిన జానీ బెయిర్‌స్టో (12), మనీశ్ పాండే(38), అబ్దుల్ సమద్ (0) భారీ షాట్ ఆడబోయి వికెట్లు చేజార్చుకున్నారు. ఈ ముగ్గురు ఔట్ తర్వాత హైదరాబాద్ చెదిరిపోయింది.


షబాజ్ అహ్మద్ ఫుల్ లెంగ్త్ రూపంలో విసరగా.. మిడ్ వికెట్ దిశగా భారీ షాట్ ఆడేందుకు జానీ బెయిర్‌స్టో ప్రయత్నించాడు. కానీ.. టాప్ ఎడ్జ్ తాకిన బంతి షార్ట్ మిడ్ వికెట్‌లో వికెట్ కీపర్ ఏబీ డివిలియర్స్ చేతికి చిక్కింది. ఆ తర్వాత బంతికి క్రీజు వెలుపలికి వెళ్లి మనీశ్ పాండే పెద్ద షాట్ ఆడే ప్రయత్నం చేయగా.. షబాబ్ తెలివిగా ఆఫ్ స్టంప్‌కి దూరంగా బంతి వేశాడు. దాంతో.. మనీశ్ పాండే షాట్‌ని ఆశించిన విధంగా కనెక్ట్ చేయలేకపోయాడు. అతని బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి షార్ట్ థర్డ్ మ్యాన్‌లో ఫీల్డర్ హర్షల్ పటేల్ చేతికి చిక్కింది. ఆ ఓవర్ చివరి బంతికి అబ్దుల్ సమద్ కూడా మిడ్ వికెట్ దిశగా షాట్ కోసం ప్రయత్నించాడు. కానీ.. బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి నేరుగా బౌలర్ షబాబ్ అహ్మద్ చేతుల్లోకి వెళ్లిపోయింది. మొత్తంగా.. బంతిని ఊరిస్తూ.. ఎక్కువగా టర్న్ చేసిన షబాబ్.. ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు పడగొట్టడం ద్వారా బెంగళూరు హీరోగా మారిపోయాడు.





Untitled Document
Advertisements