ఔట్ అయిన కోపంతో కుర్చీని బ్యాట్‌తో కొట్టిన కోహ్లీ...మ్యాచ్ రిఫరీ వార్నింగ్

     Written by : smtv Desk | Thu, Apr 15, 2021, 12:03 PM

ఔట్ అయిన కోపంతో కుర్చీని బ్యాట్‌తో కొట్టిన కోహ్లీ...మ్యాచ్ రిఫరీ వార్నింగ్

ఐపీఎల్ 2021 సీజన్‌‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీకి మ్యాచ్ రిఫరీ షంషుద్దీన్ వార్నింగ్ ఇచ్చాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో.. ఔటైన తర్వాత కోపంగా పెవిలియన్‌కి వెళ్తూ విరాట్ కోహ్లీ క్రమశిక్షణ తప్పాడు. బ్యాట్‌తో బౌండరీ లైన్‌‌‌ని కొట్టడంతో పాటు ఆర్సీబీ డగౌట్‌లోని కుర్చీనీ కూడా బ్యాట్‌తో గట్టిగా కొట్టాడు. దాంతో.. మ్యాచ్ ముగిసిన తర్వాత రిఫరీ.. ఐపీఎల్ క్రమశిక్షణ నియమావళి‌ని కోహ్లీ తప్పాడని నిర్ధారించి.. మందలించాడు.

అసలు ఏం జరిగిందంటే..? ఇన్నింగ్స్ 13వ ఓవర్ వేసిన జేసన్ హోల్డర్ మొదటి బంతిని షార్ట్ బాల్ రూపంలో సంధించాడు. బంతి కాస్త లెగ్ సైడ్ రావడంతో విరాట్ కోహ్లీ (33: 29 బంతుల్లో 4x4) ఫైన్ లెగ్ దిశగా ఆ బాల్‌ని హిట్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ.. బ్యాట్ టాప్ ఎడ్జ్ తాకిన బంతి గాల్లో లేవగా.. ఫీల్డర్ విజయ్ శంకర్ పరుగెత్తుకుంటూ వచ్చి చక్కగా డైవ్ చేస్తూ క్యాచ్ అందుకున్నాడు. దాంతో.. విరాట్ కోహ్లీ పెవిలియన్‌కి వెళ్లక తప్పలేదు.


సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై గత నాలుగేళ్లుగా పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తున్న విరాట్ కోహ్లీ.. ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ మార్క్‌ని అందుకునేలా కనిపించాడు. కానీ.. ఊహించని విధంగా బ్యాట్ టాప్ ఎడ్జ్‌లో తాకిన బంతి క్యాచ్‌గా వెళ్లడంతో విరాట్ కోహ్లీ కోపం కట్టలు తెంచుకుంది. అసహనంతోనే మైదానం వీడిన కోహ్లీ.. బౌండరీ లైన్‌ని దాటే సమయంలో కోపంగా ఆ లైన్‌ని బ్యాట్‌తో హిట్ చేశాడు. అలానే వెళ్లి డగౌట్‌లోని కుర్చీని కూడా గట్టిగా కొట్టాడు. దాంతో.. మ్యాచ్ రిఫరీ అతడ్ని మందలించాడు. ఈ మ్యాచ్‌లో బెంగళూరు 6 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.







Untitled Document
Advertisements