కర్ణాటక ఆర్టీసీ కార్మికుల సమ్మె...కార్మికులపై క్రమశిక్షణ చర్యలు?

     Written by : smtv Desk | Thu, Apr 15, 2021, 12:10 PM

కర్ణాటక ఆర్టీసీ కార్మికుల సమ్మె...కార్మికులపై క్రమశిక్షణ చర్యలు?

కర్ణాటక ఆర్టీసీ సంక్షోభంలో చిక్కుకుంటోంది. వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ కార్మికులు చేపట్టిన సమ్మె తొమ్మిదో రోజుకు చేరింది. కార్మికుల సమ్మె కారణంగా ఆర్టీసీకి రూ.152 కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. కార్మికుల సమ్మె కారణంగా బస్సులన్నీ ఆర్టీసీ డిపోలకే పరిమితమయ్యాయి. ప్రత్యామ్నాయ మార్గాలు చేపట్టినా కేవలం 20 శాతం బస్సులు మాత్రమే నడుస్తున్నాయి. ఈ ఉగాదికి భారీ నష్టం వాటిల్లింది.

పండుగ వేళ బెంగళూరు నగరం నుంచి సొంతూళ్లకు వెళ్తే ప్రయాణికులతో రద్దీ ఉంటుంది. కార్మికుల సమ్మెతో అవసరానికి అనుగుణంగా బస్సులు నడపలేకపోవడంతో భారీ నష్టం వాటిల్లింది. సుమారు రూ.152 కోట్ల నష్టాల్లో ఒక్క కేఎస్ ఆర్టీసీకే సగం నష్టం వచ్చిందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల వేతనాలు 8 నుంచి 10 శాతం పెంచాలని కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం భావించింది. అయితే తమకు 6వ వేతన సవరణ సంఘం ప్రతిపాదనలను అమలు చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. అందుకు ప్రభుత్వం సంసిద్ధంగా లేకపోవడంతో కార్మికులు సమ్మెబాట పట్టారు.

గతంలో తెలంగాణలోనూ ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు. వేతనాలు పెంచాలంటూ పండుగ సమయంలో బస్సులను నిలిపివేసి ఇరుకునపెట్టారు. అయితే తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం కార్మికులపై క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించడంతో ఎలాంటి హామీ లేకుండానే 52 రోజుల అనంతరం కార్మికులు దిగొచ్చారు. అదే బాటలో కర్ణాటకలోని యడియూరప్ప ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కేసీఆర్ ఫార్ములానే సీఎం యడియూరప్ప ఫాలో అవుతున్నారు. కార్మికులు విధులకు హాజరుకాకుంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. చివరికి ఏమవుతుందో చూడాలి మరి!!





Untitled Document
Advertisements