పది పరీక్షల రద్దు చేసే ఆలోచనలో తెలంగాణ సర్కార్?!

     Written by : smtv Desk | Thu, Apr 15, 2021, 01:06 PM

పది పరీక్షల రద్దు చేసే ఆలోచనలో తెలంగాణ సర్కార్?!

తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వార్షిక పరీక్షల నిర్వహణ సందిగ్ధంలో పడింది. మే 1 నుంచి ఇంటర్ పరీక్షల నిర్వహణకు ఇప్పటికే షెడ్యూల్‌ విడుదల చేసినా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అవి జరుగుతాయా? లేదా? అన్నది అనుమానంగా మారింది. టెన్త్ పరీక్షలను రద్దు చేసి, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేయాలని బుధవారం కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అయోమయంలో పడింది. కరోనా కేసుల ఉధృతి ఇలాగే కొనసాగితే ఈ ఏడాది కూడా పదో తరగతి, ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దు చేసి విద్యార్థులను పైతరగతులకు పంపే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

మే 1 నుంచి ఇంటర్‌ ఫస్టియర్, రెండో తేదీ నుంచి సెకండియర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఇంటర్ బోర్డు గతంలోనూ షెడ్యూల్ విడుదల చేసింది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తే తప్ప పరీక్షల వాయిదాపై తాము నిర్ణయం తీసుకోలేమని, ప్రస్తుతం పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపైనే ఫోకస్ పెట్టామని ఇంటర్‌ బోర్డు అధికారులు చెబుతున్నారు. ఈ నెలాఖరు వరకు కరోనా కేసుల తీవ్రతను బట్టి పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ సర్కార్ భావిస్తూ వచ్చింది. అయితే బుధవారం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడంతో తెలంగాణ ప్రభుత్వం కూడా సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

కరోనా ప్రభావం మరో రెండు నెలల వరకు తగ్గే అవకాశాల్లేవని, వచ్చే నాలుగు వారాలు అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ చేస్తున్న సూచనలతో ప్రభుత్వం ఆలోచనలో పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో మే 1 నుంచి జరిగే ఇంటర్ పరీక్షలను వాయిదా వేయడం తప్ప మరో మార్గం కనిపించడం లేదని ఇంటర్ బోర్డు అధికారులు అభిప్రాయపడుతున్నారు. జూన్‌ వరకూ కేసుల ఉధృతి తగ్గకపోతే టెన్త్ విద్యార్థులను గతేడాది మాదిరిగానే పాస్‌ చేసేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గతేడాది ఇంటర్నల్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థుల సామర్థ్యాన్ని లెక్కించి మార్కులు కేటాయించారు.

అయితే ఈసారి ప్రత్యక్ష తరగతులు, పరీక్షలు సక్రమంగా జరగనందున.. సీబీఎస్ఈ పదో తరగతి విద్యార్థులకు మార్కులు కేటాయింపునకు అవలంబించనున్న ఆబ్జెక్టివ్‌ విధానాన్ని అధ్యయనం చేయాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. ఇది సాధ్యపడకపోతే పరీక్షలు రద్దు చేసి, అందరూ పాస్ అయినట్లుగా ప్రకటించే అవకాశాలున్నాయి. దీంతో పాటు ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలనూ రద్దుచేసి, వాటిని వచ్చే విద్యాసంవత్సరంలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. నీట్‌, జేఈఈ, ఇతర జాతీయస్థాయి పరీక్షలకు ఇంటర్‌ సెకండియర్‌ కీలకమైంది. దీంతో ఇంటర్ సెకండియర్ పరీక్షలను ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయబోమని, ఆలస్యంగానైనా పరీక్షలు నిర్వహించి తీరుతామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.





Untitled Document
Advertisements