బతికుండగానే కోవిడ్ రోగిని రెండుసార్లు చంపేసిన డాక్టర్లు

     Written by : smtv Desk | Thu, Apr 15, 2021, 04:08 PM

బతికుండగానే కోవిడ్ రోగిని రెండుసార్లు చంపేసిన డాక్టర్లు

కరోనా బాధితుడి విషయంలో సిబ్బంది వ్యవహరించిన తీరు ప్రభుత్వ హాస్పిటల్స్‌లో నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచింది. వైద్యుల నిర్లక్ష్యం కోవిడ్ బాధితుడు బతికుండగానే రెండుసార్లు మరణించేలా చేసి, కుటుంబసభ్యులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని విదీశ ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. విదిశాలోని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో గోరెలాల్‌ అనే వ్యక్తి కోవిడ్‌కు చికిత్స పొందుతున్నారు. అయితే, గోరేలాల్ చనిపోయాడని ఏప్రిల్ 13న అతడి కుటుంబసభ్యులకు సమాచారం అందింది.

దీంతో బంధువులు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకోగా.. అతడు ప్రాణాలతోనే ఉన్నట్టు వైద్యులు చెప్పడంతో ఊపిరిపీల్చుకున్నారు. కానీ, ఏప్రిల్ 14న ఉదయం మళ్లీ కుటుంబసభ్యులకు గోరేలాల్ చనిపోయాడని ఆస్పత్రి సిబ్బంది చెప్పడంతో అక్కడకు చేరుకున్నారు. ఆసుపత్రికి వద్దకు వెళ్లిన బంధువులకు.. అతడి మృతదేహాన్ని మూటకట్టి అప్పగించారు. అప్పటికే హాస్పిటల్‌లోని వైద్యుల తీరుతో విసుగిపోయిన కుటుంబసభ్యులు ఆ మృతదేహాన్ని చూపించాలని పట్టుబట్టారు. చనిపోయింది తమవాడు కాదేమోనని అనుమానం వ్యక్తం చేశారు.

బంధువుల ఒత్తిడితో మృతదేహాన్ని ఆసుపత్రి సిబ్బంది తెరవగా.. కుటుంబసభ్యులు షాక్‌కు గురయ్యారు. అతడు గోరేలాల్‌ కాదని తెలియడంతో తమ అనుమానం నిజమయ్యిందని వైద్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బతికున్న వ్యక్తిని రెండుసార్లు చంపేశారని? ఇది తమను తీవ్ర మానసిక క్షోభకు గురిచేసిందని కుటుంబ సభ్యులు మండిపడ్డారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని ఆందోళనకు దిగారు. జరిగిన తప్పునకు క్షమాపణలు కోరిన ఆస్పత్రి వర్గాలు వారికి సర్దిచెప్పి గొడవను సద్దుమణిగేలా చేశారు.





Untitled Document
Advertisements