పనిమనిషి కూతురిని 10 లక్షలకు కొనుక్కున్న పారిశ్రామికవేత్త

     Written by : smtv Desk | Thu, Apr 15, 2021, 06:04 PM

పనిమనిషి కూతురిని 10 లక్షలకు కొనుక్కున్న పారిశ్రామికవేత్త

ఇంట్లో పనిచేసి మానేసిన పనిమనిషి కూతురిని పది లక్షలకు కొనుక్కున్నాడో బడాబాబు. కన్నబిడ్డను తల్లిదండ్రులే ఎంచక్కా ఓనర్‌కి అమ్మేసి గుట్టుచప్పుడు కాకుండా బాలికను అప్పగించేశారు. అయితే అమ్మమ్మకి అనుమానం రావడంతో అసలు విషయం గుప్పుమంది. సీన్‌లోని పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. తమిళనాడులోని సేలంలో జరిగిన ఈ ఘటన వివరాలు..

సేలం జిల్లా అన్నాదానపట్టికి చెందిన సుమతి(26), సతీష్ కుమార్(30) భార్యాభర్తలు. వారికి పదేళ్ల కూతురు ఉంది. కొన్నేళ్ల కిందట సుమతి సేలంలోని ఓ ఎక్స్‌పోర్ట్ కంపెనీ యజమాని కృష్ణన్‌ ఇంట్లో పనిచేసింది. ఇటీవల పని మానేసిన సుమతి కుటుంబంతో సహా అన్నాదానపట్టికి వచ్చి నివాసముంటోంది. అనూహ్యంగా ఆమె కూతురు కనిపించకుండా పోయింది. పదేళ్ల కూతురు కనిపించకపోయినా తల్లిదండ్రులు మౌనంగా ఉండడంపై బాలిక అమ్మమ్మకి అనుమానం వచ్చింది.

తన మనుమరాలు కనిపించడం లేదంటూ పోలీసులను ఆశ్రయించడంతో కథ అడ్డం తిరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు సుమతి, సతీష్‌లను అదుపులోకి తీసుకుని విచారించడంతో అమ్మాయిని విక్రయించినట్లు తేలింది. పాత యజమాని కృష్ణన్‌‌కి కూతురిని పది లక్షల రూపాయలకు అమ్మేసినట్లు ఒప్పుకోవడంతో నిందితులు ముగ్గురినీ అరెస్టు చేశారు. మనస్పర్థల కారణంగా భార్యకి దూరంగా ఉంటున్న కృష్ణన్‌ పదేళ్ల బాలికను కొనుగోలు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిన్నారిని పెంచుకోవాలనుకున్నా.. దత్తత తీసుకోకుండా అక్రమ మార్గంలో కొనుగోలు చేయడం అనుమానాలకు తావిస్తోంది.





Untitled Document
Advertisements